AP: కార్యకర్తకు పట్టం.. రమాదేవికి పెద్దల సభలో చోటు!
AP: అనంతపురం జిల్లాకు చెందిన సామాన్య కార్యకర్త దళవాయి రమాదేవిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
AP: కార్యకర్తకు పట్టం.. రమాదేవికి పెద్దల సభలో చోటు!
AP: పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి పదవులు దక్కుతాయనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ మరోసారి నిరూపించింది. అధికారం కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసిన సాధారణ కార్యకర్తకు పెద్దల సభలో అవకాశం కల్పిస్తూ టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి రమాదేవిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిర్ణయంతో రమాదేవికి ఈ అవకాశం దక్కింది.
ఎవరి ఊహకూ అందని విధంగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన రమాదేవిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ద్వారా సామాజిక సమీకరణాలతో పాటు పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇచ్చే విధానాన్ని టీడీపీ అధిష్టానం చాటిచెప్పింది. ఎమ్మెల్సీ పదవి కోసం పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ.. చివరకు పదవుల కోసం పోటీ పడని, పార్టీ అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించిన రమాదేవికి అవకాశం దక్కడం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
22 ఏళ్లుగా పార్టీతో అనుబంధం
దళవాయి రమాదేవి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. దాదాపు 22 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. స్థానికంగా టీడీపీ కుటుంబంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా తూచా తప్పకుండా నిర్వహించడం రమాదేవి ప్రత్యేకతగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం అనంతపురం పార్లమెంట్ టీడీపీ అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రమాదేవి.. అనంతపురం నగరంలో క్లస్టర్ ఇన్‌చార్జ్‌గా కూడా పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. కార్యకర్తలతో నిరంతరం అందుబాటులో ఉంటూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు.
ఓటమిలోనూ వెనక్కి తగ్గని నిబద్ధత
2021 అనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో 47వ డివిజన్ కార్పొరేటర్‌గా రమాదేవి పోటీ చేశారు. రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులను ఎదుర్కొంటూనే ఎన్నికల బరిలో నిలిచారు. కేవలం 37 ఓట్ల తేడాతో ఓటమి పాలైనా.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరం కాలేదు. ఓటమిని ఒక అడుగుగా తీసుకుని మరింత పట్టుదలతో పార్టీ కోసం పనిచేశారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ విజయానికి కూడా రమాదేవి కృషి చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేస్తూ.. ఎన్నికల ప్రచారం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
‘కార్యకర్తే అధినేత’ నినాదానికి ఆచరణ
టీడీపీ ఇటీవల పార్టీ కమిటీల కూర్పులోనూ సాధారణ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. మండల స్థాయి పార్టీ అధ్యక్షురాలిగా, క్లస్టర్ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ నిర్మాణంలో కింది స్థాయి నుంచి పైస్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చింది. అదే విధానాన్ని ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపికలోనూ కొనసాగించింది.
పార్టీ కోసం రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన ఓ సాధారణ కార్యకర్తకు ఏకంగా శాసనమండలిలో అవకాశం కల్పించడం ద్వారా ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని ఆచరణలో చూపించినట్టయింది. పదవి కోసం పరుగులు తీసేవారికంటే.. పార్టీ కోసం నిశ్శబ్దంగా పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందనే సందేశాన్ని రమాదేవి ఎంపిక స్పష్టం చేస్తోంది.
అనంతపురం రాజకీయాల్లో సాధారణ కార్యకర్తగా మొదలైన రమాదేవి ప్రస్థానం ఇప్పుడు శాసనమండలి వరకు చేరింది. పార్టీ కోసం చేసిన సేవలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్న ఈ ఎమ్మెల్సీ అవకాశం.. టీడీపీ క్షేత్రస్థాయి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే పరిణామంగా మారింది.