AP: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు చారిత్రాత్మకం: బీజేపీ ఓబీసీ మోర్చా!

AP: ఏపీ స్థానిక సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం రిజర్వేషన్ల అమలుపై బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.

Update: 2026-08-21 13:31 GMT

AP: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు చారిత్రాత్మకం: బీజేపీ ఓబీసీ మోర్చా!

AP: నిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ అన్నారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

శుక్రవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. గతంలో అమల్లో ఉన్న 34 శాతం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడం ద్వారా బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీశారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బెదిరింపులు, అక్రమాలు, దౌర్జన్యాల మధ్య నిర్వహించారని ఆరోపించారు.

బీసీ సమాజం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న రాజకీయ హక్కులను ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం ఇతర వర్గాలకు మళ్లించడం సరికాదని గోపి శ్రీనివాస్ అన్నారు. బీసీలకు కేటాయించిన రాజకీయ రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే దక్కాలని స్పష్టం చేశారు. ఇతర వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటే చట్టబద్ధంగా ఉన్న ఇతర మార్గాలను అనుసరించాలని సూచించారు. గతంలో స్థానిక సంస్థల్లో ముస్లింలకు బీసీ కోటా ద్వారా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన అంశంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

మోదీ పాలనలో సామాజిక న్యాయానికి పెద్దపీట

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బీసీల సామాజిక, విద్యా, రాజకీయ అభ్యున్నతికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని గోపి శ్రీనివాస్ పేర్కొన్నారు. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించడంతో పాటు, 105వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలకు బీసీ జాబితాల విషయంలో అధికారాలను కల్పించారని తెలిపారు. కేంద్ర విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ల అమలుతో వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు. నీట్‌లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుతో బీసీ విద్యార్థులకు వైద్య విద్యలో అవకాశాలు పెరిగాయని చెప్పారు.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తున్నాయని పేర్కొంటూ.. ఈ రెండు ప్రభుత్వాలను ‘డబుల్ ఇంజిన్ సర్కార్’గా అభివర్ణించారు. స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు బీసీల రాజకీయ సాధికారతకు దోహదపడతాయని అన్నారు.

సమావేశంలో మీడియా ఇంచార్జి కిలారి దిలీప్, ఓబీసీ మోర్చా రాష్ట్ర రీసెర్చ్ టీం సభ్యుడు మారేష్, కోస్తా జోన్ ఇంచార్జి తుల్లిమిల్లి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి చోరగుడి శివలలిత, కార్యవర్గ సభ్యుడు ఉండవల్లి కృష్ణారావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కందుల సుబ్రహ్మణ్యం యాదవ్, జిల్లా ఇంచార్జి కేతన బోయిన హనుమంతరావు పాల్గొన్నారు.

Tags:    

Similar News