AP: బీసీ బిడ్డలకు ఐఐటీ–జేఈఈ, నీట్ శిక్షణ.. ఉన్నత విద్యకు కూటమి సర్కార్ భరోసా!
AP: బీసీ విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్ ఉచిత శిక్షణ అందించేందుకు అమలాపురం, తిరుపతిలలో రెండు ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కేంద్రాలను రూ.6.86 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మంత్రి ఎస్. సవిత వెల్లడించారు.
AP: బీసీ బిడ్డలకు ఐఐటీ–జేఈఈ, నీట్ శిక్షణ.. ఉన్నత విద్యకు కూటమి సర్కార్ భరోసా!
AP: బీసీ బిడ్డల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. బీసీ గురుకులాలు, వసతి గృహాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు, ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఐఐటీ–జేఈఈ, నీట్ శిక్షణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస విద్యాసంస్థల సంఘం ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు పనిచేయనున్నాయి. అమలాపురంలో ఏర్పాటు చేసే కేంద్రంలో బాలురకు, తిరుపతిలో ఏర్పాటు చేసే కేంద్రంలో బాలికలకు శిక్షణ అందించనున్నారు. ప్రతి కేంద్రంలో 160 మంది చొప్పున విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అంటే రెండు కేంద్రాల ద్వారా మొత్తం 320 మంది బీసీ విద్యార్థులకు ఐఐటీ–జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ లభించనుంది.
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎంపీసీ విభాగంలో 80 మంది, బైపీసీ విభాగంలో 80 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఎంజేపీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ ఎక్స్‌లెన్స్ కేంద్రాలకు ఎంపిక చేయనున్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల్లో విద్యార్థులకు నిరంతర శిక్షణ అందిస్తూ పోటీ పరీక్షలకు సిద్ధం చేయనున్నారు.
ఐఐటీ–జేఈఈలో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందడంతో పాటు, నీట్‌లో ప్రతిభ కనబరిచి ఎయిమ్స్, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధిక సంఖ్యలో సీట్లు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన బీసీ విద్యార్థులకు ఖరీదైన కోచింగ్ అవసరం లేకుండా ప్రభుత్వమే నాణ్యమైన శిక్షణ అందించే అవకాశం కల్పిస్తోందన్నారు.
బీసీ విద్యార్థుల్లో ప్రతిభకు కొదవ లేదని, సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ అందితే జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వారు అద్భుత ఫలితాలు సాధించగలరని మంత్రి పేర్కొన్నారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు బీసీ విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాది వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీసీ బిడ్డల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు మంత్రి సవిత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బీసీ విద్యార్థులకు విద్య, ఉపాధి, ఉన్నత అవకాశాల్లో సమాన అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.