Nirmal: ఆలయాలు, ఇళ్లలో వరుస దొంగతనాలు: టాస్క్‌ఫోర్స్ పంజా!
Nirmal: నిర్మల్ జిల్లాలో వరుసగా దేవాలయాలు, ఇళ్లు, దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను టైగర్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Nirmal: ఆలయాలు, ఇళ్లలో వరుస దొంగతనాలు: టాస్క్‌ఫోర్స్ పంజా!
నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలో దేవాలయాలు, ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను నిర్మల్ జిల్లా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
దొంగతనాల నివారణ కొరకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టైగర్స్ టాస్క్ ఫోర్స్ బృందం దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించి, భైంసా ఏఎస్పీ, నిర్మల్ డీఎస్పీ ఆధ్వర్యంలో సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలు, గత నేరాల వివరాలను విశ్లేషిస్తూ దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితులకు నిర్మల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 25 దొంగతనాల కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వీటిలో 16 కేసులకు సంబంధించిన చోరీ సొత్తును రికవరీ చేశారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహాదేవ్‌పురం, శాస్త్రినగర్, సోఫీనగర్, గల్లాపేట్ రోడ్, బంగల్‌పేట్ తదితర ప్రాంతాల్లో జరిగిన ఇంటి దొంగతనాలు, కాపర్ వైర్ చోరీలు, ఆలయ చోరీలకు సంబంధించిన కేసులను ఛేదించినట్లు తెలిపారు .
మహాదేవ్‌పురంఇంటి దొంగతనంలో బంగారం, వెండి ఆభరణాల చోరీ కేసును ఛేదించి సొత్తును రికవరీ చేశారు. అదేవిధంగా శాస్త్రినగర్ ఇంటి దొంగతనంలో నగదు చోరీ కేసును, దివ్యనగర్ అయ్యప్ప స్వామి ఆలయ చోరీ కేసును, ప్రియదర్శిని నగర్ ఇళ్లలో జరిగిన దొంగతనాల కేసును, ఏ.ఎన్. రెడ్డి కాలనీ హౌస్ బ్రేకింగ్ కేసును, మహాలక్ష్మివాడ మహాలక్ష్మి ఆలయ దొంగతనం కేసును ఛేదించారు. దీంతోపాటు శాస్త్రినగర్ హనుమాన్ ఆలయం లో చోరీకి గురైన రెండు వెండి కిరీటాలు, ఒక కవచం, గొల్లపేట్ రోడ్ ఇంటిలో వెండి, నగదు. బంగల్‌పేట్ మహాలక్ష్మి ఆలయం వెండి చోరీ కేసు సంబంధం ఉన్న వ్యక్తులను అరెస్టు చేశారు.
దీంతోపాటు నిర్మల్ రూరల్ పరిధిలో గల తల్వేద X రోడ్ వద్ద ఇంటి దొంగతనానికి యత్నించిన కేసులో నిందితుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. కౌట్ల-కె గ్రామంలోని రామాలయంలో వెండి ఆభరణాలు, ఇతర వస్తువుల చోరీ కేసును కూడా ఛేదించారు. మామడ మండల పరిధిలోని కొరిటికల్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు, ఇతర వస్తువుల చోరీ కేసులో నిందితుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సారంగాపూర్ మండల పరిధిలో వంజర్ మహాలక్ష్మి ఆలయంలో వెండి చోరీ, ఆలూర్ శివాలయంలో వెండి చోరీ కేసులను, లోకేశ్వరం మండల పరిధిలోని కిష్టాపూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వెండి నాగుపాము ఆభరణం చోరీ చేసిన కేసులో నిందితుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.
లక్ష్మణచాంద మండలంలోని వాడ్యాల్ హనుమాన్ ఆలయంలో వెండి ఆభరణాల చోరీ కేసులో నిందితుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తానూర్ మండలంలోని పోచమ్మ ఆలయంలో చోరీకి యత్నించిన కేసులో నిందితుల ప్రమేయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక ఆలయంలో జరిగిన చోరీ కేసుల్లోనూ నిందితుల ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు.
నిర్మల్ టైగర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన అనంతరం గత 10 రోజుల్లో నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్ పరిధిలో దొంగతనాలకు సంబంధించిన పలు కేసులను పోలీసులు వేగంగా ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు తెలిపారు. దొంగతనాల కేసులతోపాటు నిర్మల్ రూరల్ పరిధిలో కాపర్ వైర్ చోరీ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. బర్కత్‌పురా హౌస్ బ్రేకింగ్ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి బంగారు, వెండి ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు.
షట్టర్ లిఫ్టింగ్ కేసులో 15 కిలోల కాపర్ వైర్‌ను రికవరీ చేశామన్నారు. అలాగే నర్సరీ శాంతినగర్‌లో జరిగిన మొబైల్ ఫోన్ చోరీ కేసును కేవలం 24 గంటల్లో ఛేదించి నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. పల్సర్ బైక్ చోరీ కేసులో నిందితుడిని గుర్తించి బైక్‌ను రికవరీ చేశామన్నారు. చోరీ జరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలు, గత నేరాల వివరాలను విశ్లేషించి వారి ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారని వివరించారు.
వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులను పరస్పరం అనుసంధానిస్తూ దర్యాప్తు చేపట్టడంతో నిందితుల ప్రమేయం వెలుగులోకి వచ్చిందని, ఇప్పటికే 16 కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేయగా, మిగిలిన కేసులకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ కేసులను ఛేదించడంలో కృషి చేసిన భైంసా ASP సాయి కిరణ్, నిర్మల్ DSP శ్రీనివాస్, CIలు కృష్ణ, సమ్మయ్య, SIలు లింబాద్రి, గణేష్, శ్రీకాంత్, s.కె. గఫార్, హెడ్ కానిస్టేబుల్ జగన్ సింగ్, PCలు తిరుపతి, సతీష్లను జిల్లా ఎస్పీ డాజానకి షర్మిల ప్రత్యేకంగా అభినందించారన్నారు.
దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, దేవాలయాలు, ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టుబడ్డ వారిలో రాజశేఖర్, రాజేశ్వర్, శ్రీకాంత్, రామ్ చరణ్, క్రాంతి తదితరులు ఉన్నారు. నిందితుల వద్ద నుండి 3 ద్విచక్ర వాహనాలు, ఏడున్నర గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.