Basara: ట్రిపుల్ ఐటీ బాసరలో కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల మూడవ రోజు నిరసన!
Basara: బాసర ట్రిపుల్ ఐటీలో కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం మూడవ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
Basara: ట్రిపుల్ ఐటీ బాసరలో కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల మూడవ రోజు నిరసన!
బాసర: బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వరుసగా మూడవ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గత 18 సంవత్సరాలుగా ఎలాంటి విరామం లేకుండా సంస్థలో విధులు నిర్వహిస్తూ, విద్యాసంస్థ అభివృద్ధికి తమ సేవలను అందిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు తమకు రావలసిన న్యాయపరమైన హక్కులు, ఉద్యోగ ప్రయోజనాలు అమలు కాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఉద్యోగులు తమ సమస్యలను విన్నవించుకుంటూ ప్రధానంగా మూడు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.
1. సమాన పనికి సమాన వేతనం: సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతన విధానాన్ని అమలు చేయాలి.
2. ఈపీఎఫ్ (EPF): ప్రతి ఉద్యోగికి వర్తించాల్సిన ఈపీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి.
3. ఉద్యోగ క్రమబద్ధీకరణ: గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి.
సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకొని, న్యాయం చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో అధ్యక్షులు శాంబాబు, ఉపాధ్యక్షులు డాక్టర్ అరుణ జ్యోతి, జనరల్ సెక్రటరీ సుధీర్, జాయింట్ సెక్రటరీ సుధాకర్‌తో పాటు సభ్యులు శైలజ, అర్చన, అనిత, అంజలి, సారిక తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.