Nirmal: రబీ సీజన్‌లో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి: డీఏఓ సుజాత

Nirmal: సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలోని బయో రీసెర్చ్ సెంటర్‌ను జిల్లా వ్యవసాయ అధికారి సుజాత శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రం నిర్వహణ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల అమలును పరిశీలించి, రైతులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించాలని సూచించారు. ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని అధిక నీరు అవసరమయ్యే వరి, మొక్కజొన్న పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలకు రబీ సీజన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి నూనెగింజల పంటలతో పాటు శనగ, మినుము, పెసర వంటి పప్పుధాన్యాలు సాగు చేయాలని సూచించారు. జొన్న, సజ్జ, రాగి, కొర్ర వంటి చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, కూరగాయల సాగు, పాడి పరిశ్రమపైనా రైతులు దృష్టి సారించాలని తెలిపారు.

గత సీజన్‌లో మొక్కజొన్న సాగు చేసిన భూముల్లో పంట మార్పిడిలో భాగంగా ప్రస్తుతం సాగు చేస్తున్న జొన్న పంటను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని రైతులందరూ రబీ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. భూగర్భ జలమట్టాలను పెంచేందుకు ప్రతి రైతు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా బోరుబావుల సౌకర్యం ఉన్న రైతులు తమ వ్యవసాయ భూముల్లో తప్పనిసరిగా రీచార్జ్ పిట్లు నిర్మించుకోవాలన్నారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడం ద్వారా భూగర్భ జలాలను సంరక్షించుకోవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో ఏడీఏలు రాజశేఖర్ రెడ్డి, ఆసం రవి, వ్యవసాయ అధికారి వినోద్, ఏఈఓలు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags: