Nirmal: పెండింగ్ భూ సమస్యలను త్వరగా పరిష్కరించండి: నిర్మల్ కలెక్టర్!

Nirmal: నిర్మల్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, 22-ఏ వివాదాలను ప్రాధాన్యత క్రమంలో వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

Update: 2026-09-01 17:12 GMT

Nirmal: పెండింగ్ భూ సమస్యలను త్వరగా పరిష్కరించండి: నిర్మల్ కలెక్టర్!

నిర్మల్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో భూభారతి, భూముల సర్వే–రీ-సర్వే, నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ, సీఎంఆర్‌ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

మండలాల వారీగా పెండింగ్‌ భూ సమస్యలపై తహసీల్దార్లను వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్‌, ముఖ్యంగా 22-ఏ కింద ఉన్న భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. భూముల సర్వే, రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభలు నిర్వహించిన అనంతరమే రీ-సర్వే ప్రారంభించాలని, గ్రామసభలకు సంబంధించిన రికార్డులను పక్కాగా నమోదు చేయాలని స్పష్టం చేశారు.

సర్వే పనులను వేగవంతం చేసేందుకు అదనంగా ఐదు అధునాతన సర్వే యంత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. సర్వే వివరాలను ప్రతిరోజూ నమోదు చేస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని వేగవంతం చేసి, రేషన్‌ డీలర్ల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.

సీఎంఆర్‌ ప్రక్రియను నిర్దేశిత గడువులో పకడ్బందీగా పూర్తి చేయాలని, రైస్‌ మిల్లులను అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌, డీఆర్వో రాథోడ్‌ రమేష్‌, డిప్యూటీ కలెక్టర్‌ రాకేష్‌, ఆర్డీవో దేవీదాస్‌, సంబంధిత అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News