హాస్టల్ విద్యార్థులను పంపే విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం.. కిలోమీటర్ల కొద్దీ క్యూలో నిలబడితే కరోనా రాదా..?

Update: 2020-03-26 06:11 GMT

అసలు ఈ విషయం ఇంత పెద్ద సమస్యగా మారడానికి కారణాలేంటి..? కరోనాను కట్టడి చేసే క్రమంలో తీవ్ర నిర్ణయాలు తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. హాస్టల్ విద్యార్థులను స్వస్థలాలకు పంపే విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు..? హాస్టళ్ల ఖాళీ నుంచి అంతర్‌రాష్ట్ర సరిహద్దు వరకు మధ్య నలిగిన విద్యార్థుల ఆవేదనను వినేదెవరు..? అసలు ఎక్కడ తప్పు జరిగింది..? ఎవరు బలయ్యారు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

సోషల్ డిస్టెన్స్‌ పాటించాలంటూ.. ప్రధాని నుంచి కామన్ మెన్ వరకు అందరూ నోళ్లు నొచ్చుకునేలా చెబుతున్నారు. చేతులెత్తి దండాలు పెడుతున్నామని ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కూడా చెప్పుకొచ్చారు. అలాంటి ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో వేలాది మంది తెలుగు రాష్ట్రాల సరిహద్దుకు ఎలా చేరుకున్నారు..? 21 రోజుల పాటు ఎవరూ ఎక్కడికి వెళ్లొద్దని చెప్పిన అధికారులు అంతమందిని వెళ్లేందుకు ఎలా అనుమతించారు..?

హాస్టళ్లు ఖాళీ చేయాలనే ఆదేశాల నేపథ్యంలో వేలాదిగా జనం పోలీసులను సంప్రదించారు. గంటల తరబడి కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్‌ తీసుకున్నారు. ఇలా ఇంతమంది జనం ఒకే దగ్గర క్యూ లైన్లలో ఉంటే వైరస్ వ్యాప్తిని నిరోధించగలమా..? మరోవైపు తమ చేతికి NOC అందడంతో వారంతా ఏపీకి బయల్దేరారు. అక్కడే అసలు సీన్ మొదలైంది. బోర్డర్ నుంచి ఏపీలోకి వచ్చేందుకు అక్కడి అధికారులు అనుమతించలేదు. దీంతో ఎలాగైనా స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వారంతా ఉసూరమన్నారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు వారి పరిస్థితి అటు ముందుకు వెళ్లలేక ఇటు వెనక్కు రాలేని పరిస్థితి ఏర్పడింది.

అసలు తెలంగాణ ప్రభుత్వం వీరికి NOC ఇచ్చే సమయంలో ఏపీ అధికారులను సంప్రదించకపోవడమే ఇంత పెద్ద తతంగం జరగడానికి కారణమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఒకే రోజు వేలాది మందికి NOC ఎలా ఇస్తారనే ప్రశ్న కూడా వస్తోంది. రోజుకు కొద్ది మందికి చొప్పున ఇస్తే. ఇంత పెద్ద గొడవ జరిగే అవకాశం ఉండదు కదా అని చెబుతున్నారు.


Tags:    

Similar News