BRS: నేడు బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

BRS: ఘనంగా 24వ వార్షికోత్సవం జరుపుకుంటున్న బీఆర్ఎస్

Update: 2024-04-27 06:17 GMT

BRS: నేడు బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం 

BRS: తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా అవతరించి యావత్‌దేశాన్ని తనవైపు చూసేలా చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా 23 ఏళ్ల క్రితం జలదృశ్యంలో పురుడుపోసుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తన లక్ష్యాన్ని ముద్దాడటం ఓ అపూర్వఘట్టం. 23 ఏళ్ల ప్రస్థానంలో దాదాపు 14 ఏళ్లు రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం సాగించి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన బీఆర్‌ఎస్‌, రాష్ట్ర ఆవిర్భావ అనంతరం తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారంలో కొనసాగింది. ఆ స్వల్పకాలంలోనే పరిపాలనలో అనేక మార్పులను చేసి చూపించింది. పార్టీ చీఫ్ కేసీఆర్ అసమాన వ్యూహ చతురత, అద్వితీయ కార్యదీక్షగల కేసీఆర్‌ చేతిలో బీఆర్‌ఎస్‌ పదిలంగా పదునెక్కి ముందుకు సాగుతుంది. 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో ఎగురవేసిన గులాబీ జెండా 23 ఏళ్లు పూర్తిచేసుకొని 24వ ఏట అడుగు పెడుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అస్తిత్వమే ప్రాతిపదికగా ఏర్పడిన బీఆర్‌ఎస్‌ అనేక ఎత్తుపల్లాలను చవిచూసింది.

పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ అనేక సంచలనాలకు కేంద్రబిందువైంది‌. చెల్లాచెదురుగా ఉన్న తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి స్వరాష్ట్ర సమరంలో భాగస్వాములను చేసింది. దేశ రాజకీయాల్లో తమకు ఎదురేలేదని చెప్పుకునే కాంగ్రెస్‌.... పరాజయభారాలతో బిక్కచచ్చిపోయిన వేళ.., 2004లో బీఆర్‌ఎస్‌తో పెట్టుకున్న పొత్తే ఆ పార్టీకి ప్రాణం పోసింది. 2009 డిసెంబర్‌ 9 ప్రకటనకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీఆర్ఎస్ కృషితో పాటు... కేసీఆర్ స్థిర నిర్ణయాలు కారణమయ్యాయి. 2001లో కరీంనగర్‌లో నిర్వహించిన సింహగర్జన బహిరంగసభ నుంచి, 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ మహాగర్జన దాకా తెలంగాణలోని దాదాపు ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ డివిజన్‌లోనూ కేసీఆర్‌ నిర్వహించిన బహిరంగసభ లెన్నో. బస్తీబాట, పల్లెనిద్ర, తండానిద్రా ఇలా అనేక రూపాల్లో దాదాపు 14 ఏళ్ల పాటు అవిశ్రాంత పోరాటం సాగించారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 జూన్‌లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌... 2023 డిసెంబర్‌ వరకు ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోగానే ఇక ఆ పార్టీ పని అయిపోయిందనే వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించడం మొదలైంది. బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌తోపాటు కొద్దిమంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌‌ను వీడారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ను నామరూపాల్లేకుండా చేస్తామని, ఆ పార్టీ నుంచి గెలిచిన వారిని ఎవ్వరినీ మిగలనీయమని, 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌ మంత్రులు భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇలాంటి ఆటుపోట్లు బీఆర్‌ఎస్‌ సమర్థంగా ఎదుర్కొంటోంది. కేసీఆర్ ప్రచారాలతో పార్టీకి మళ్లీ పునర్వైభవానికి కృషి చేస్తున్నారు.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల కోడ్‌ దృష్ట్యా బీఆర్‌ఎస్‌ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్ని జిల్లా కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికల కార్యక్రమాలతో పార్టీ యావత్తు పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు. జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.

Tags:    

Similar News