Weather Updates: మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం

Weather Updates : దాదాపుగా రెండు నెలల నుంచి వరుస అల్పపీడనాలతో ప్రజలు ఉక్కిరి, బిక్కిరి అవుతున్నారు.

Update: 2020-09-19 02:30 GMT

Weather Updates : దాదాపుగా రెండు నెలల నుంచి వరుస అల్పపీడనాలతో ప్రజలు ఉక్కిరి, బిక్కిరి అవుతున్నారు. వీటి వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వీటి ప్రభావం వల్ల ప్రధాన నదుల్లోకి వరద ప్రవాహం పెరిగి, పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు చాలావరకు మునిగిపోయాయి. ప్రస్తుతం గోదావరి శాంతించినా, కృష్ణమ్మ ఉరకలు వేస్తూనే ఉంది. ఇది పూర్తికాక ముందే మరొకటి.. అది పూర్తికాక ముందే వేరొకటి.. ఇలా రెండు నెలల నుంచి వస్తున్న వర్షాల వల్ల వేల ఎకరాల్లో పంటలు సైతం నీట మునిగాయి. ఇలా గ్రామాలను ముంచి, పంటలను నీట ముంచినా, వీటికి విశ్రాంతి లేనట్టు కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో వేరొక అల్పపీడనం రానన్నట్టు వాతావరణ శాఖ సమాచారం అందించింది. ఇలా మరో అల్పపీడనం వస్తుందని తెలియడంతో ప్రజలంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బలపడి ఈనెల 20వ తేదీ నాటికి ఈశాన్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమరావతి కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంవల్ల రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

కృష్ణమ్మ ఉగ్రరూపం

కృష్ణా నదిలో వరద ఉద్ధృతి కొనసాగు తోంది. ప్రకాశం బ్యారేజీలోకి పెద్ద ఎత్తున వరద రావడంతో శుక్రవారం 70 గేట్లు ఎత్తేసి.. దిగువకు సముద్రంలోకి 4,38,286 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండడంతో లోతట్టు ప్రాంత ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. మొదటి ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని అధికారులు సూచించారు.

► శ్రీశైలం జలాశయం ఆరు గేట్లు, కుడి విద్యుత్‌ కేంద్రం ద్వారా 1,97,264 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.20 అడుగుల్లో 210.99 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జున సాగర్‌లోకి 1,71,702 క్యూసెక్కులు చేరుతున్నాయి.

► పులిచింతల ప్రాజెక్టులోకి 1,95,927 క్యూసెక్కులు చేరుతుండగా.. 1,85,233 క్యూసెక్కులను గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.

► పెన్నాలో వరద ఉద్దృతి కొనసాగుతోంది. సోమశిలలోకి 67,833 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 78 టీఎంసీలకు చేరుకుంది. వరుసగా రెండో ఏడాది గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు.

► ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,96,420 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 800 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 1,95,031 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.   


Tags:    

Similar News