ఎస్సారెస్పీలో జలకళ.. కాళేశ్వరం జలాలతో పొంగిపోర్లుతున్న వరద కాలువలు

Update: 2020-06-24 06:12 GMT

ఉత్తర తెలంగాణ వరప్రదాయనీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. వానా కాలం పంటకు ప్రాజెక్టు ఎప్పుడు నిండుతుందా అని ఎదురుచేసే రైతన్నలకు కాళేశ్వరం ప్రాజెక్టు వరంలా మారింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో గోదావరి జలాలు సవ్వడి చేస్తున్నాయి. ప్రాజెక్టు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 30 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో ఆయకట్టు రైతులకు వర్షాల కోసం ఎదురు చూసే పరిస్థితి తప్పింది.

మహారాష్ట్రలో కురిసే వర్షాలపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భవిష్యత్తు ఆధారపడి ఉండేది. కాళేశ్వరం పుణ్యామా అని ప్రస్తుతం ఆ గండం తప్పింది. గత సంవత్సరం ఇదే నెలలో ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకుంది. కేవలం 6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కానీ ఇప్పుడు ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. కాకతీయ కెనాల్, వరద కాలువలో సైతం నీళ్లు పుష్కలంగా ఉండటంతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు అధికంగా వస్తే మెట్ట ప్రాంతాలకు తరలించేందుకు వరద కాలువను నిర్మించారు. సుమారు 22 వేల క్యూసెక్కుల నీటిని తరలించే సామర్థ్యం గల మిగులు జలాల కాలువ ఈ సారి జలకళను సంతరించుకున్నాయి. కాలువకు ఇరువైపులా ఉన్న గ్రామల పంటలకు పుష్కలంగా సాగు నీరు అందనుంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. ఆశించిన వర్షాలు కురవకున్నా ప్రాజెక్టులో 30 టీఎంసీల నీరు ఉంది. ఈనెల 30న జరిగే శివం కమిటీ సమావేశంలో ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Tags:    

Similar News