Mulugu District: ఇసుక లారీలను అడ్డగించిన సర్పంచ్.. గ్రామస్తులు
* ఇంటర్నల్ రోడ్డుపై లారీలు వెళ్తున్నాయి అని ఆగ్రహం రోడ్డు బాగు చేయాలని గ్రామస్తులు, సర్పంచ్ డిమాండ్
ఇసుక లారీలను అడ్డగించిన సర్పంచ్.. గ్రామస్తులు
Mulugu District: ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం పంచాయితీ రోడ్డుపై వెళ్తున్న ఇసుక లారీలను గ్రామస్తులు, సర్పంచ్ అడ్డుకున్నారు. ఇసుక కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్‌లోని రోడ్డుపై కాకుండా పంచాయతీలోని మరో ఇంటర్నల్ రోడ్డు నుంచి ఇసుక లారీలు వెళ్లడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. లారీలతో ప్రమాదాలు జరిగి, రోడ్డు పాడవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పరిమితికి మించి అధిక లోడుతో ఇసుక లారీలు తిరగటంతో బీసీ మర్రిగూడెం పంచాయతీ పరిధిలోని రోడ్లు గుంతలమయంగా మారుతున్నామని సర్పంచ్, గ్రామస్తులు కలిసి ఇసుక లారీలను అడ్డుకున్నారు గ్రామాల నుంచి వందలాది లారీలో అధిక లోడు ఇసుకను రవాణా చేయడంతో గ్రామీణ రోడ్లు పూర్తిగా ధ్వంసమై ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని.. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ అనుమతి లేకుండా రహదారిపై వెళ్తున్న లారీల కారణంగా రోడ్డు ధ్వంసం అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోడ్లపై విద్యార్థులు స్కూళ్లకు వెళుతుంటారని అందుకే గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారని సర్పంచ్ ఆందోళన వ్యక్తం చేశారు. చీకటి పడిందంటే ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ప్రయాణం చేసే వారు ఎక్కడ గోతిలో పడి పోతామోనని భయాందోళనకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రంగరాజపురం గ్రామం మీదుగా ప్రయాణించటంతో ఈ రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసమయిందన్నారు. గుంతల మయమైన రహదారిని కాంట్రాక్టర్లు బాగు చేయాలని వారు డిమాండ్ చేశారు.