విద్యుత్ సంస్కరణలను వన్ నేషన్ వన్ గ్రిడ్ ద్వారా చేపట్టాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రుణ పరిమితిని పెంచుతూనే కేంద్రం నిబంధనలు విధించడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడిన విషయం తెలిసిందే.

Update: 2020-05-19 07:07 GMT
Kishan Reddy (file Photo)

రుణ పరిమితిని పెంచుతూనే కేంద్రం నిబంధనలు విధించడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ ద్వారా తెలంగాణ ప్రజలకు లబ్ధి చేకూరదా? అని ఆయన ప్రశ్నించారు. దేశంలోకి కంపెనీలు, పెట్టుబడులు రావడం కోసం అనేక రకాల విధానాలను మోదీ సర్కారు అవలంభిస్తోందన్నారు. మోదీ సర్కారు నియంతృత్వ విధానాన్ని అనుసరిస్తోందంటూ కేసీఆర్ వాడకూడని భాషను వాడారన్నారు.

మూస పద్ధతిలో పాలన ఉండొద్దనే భావనతో మోదీ ప్రభుత్వం సంస్కరణలను చేపడుతుందని తెలిపారు. ప్రధాని ఓ నియమం పెడితే దాన్ని విమర్శిస్తారా అని మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణలను వన్ నేషన్ వన్ గ్రిడ్ ద్వారా చేపట్టామని మంత్రి తెలిపారు. సంస్కరణ పట్ల కేసీఆర్‌కు అభ్యంతరాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. వన్ నేషన్ వన్ రేషన్‌లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కేసీఆరే చెబుతున్నారన్నారని తెలిపారు.

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వల్ల ఏ రంగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందో కేసీఆర్ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలను అమలు చేయడానికి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేం తప్పుబట్టామా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.40 వేల కోట్లను అదనంగా కేటాయించామని, కేంద్రం దగ్గర డబ్బులు ఉండి ఇవ్వకపోతే విమర్శించాలన్నారు.


Tags:    

Similar News