Cyclone Montha: తెలంగాణపై విరుచుకుపడ్డ మొంథా తుఫాన్
Cyclone Montha: ఊహించని రీతిలో మొంథా తుఫాన్ తెలంగాణపై విరుచుకుపడింది.
Cyclone Montha: ఊహించని రీతిలో మొంథా తుఫాన్ తెలంగాణపై విరుచుకుపడింది. ఏకధాటి భారీ వర్షాలతో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేసింది. చాలా జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వాగులు, ఊళ్లు ఒక్కటయ్యాయి. రహదారులు ఏరులయ్యాయి. కొన్ని జిల్లాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. కొన్ని చోట్ల గ్రామాలను వరద ముంచెత్తింది. ఏపీలో తీరం దాటిన తుఫాన్ .. అనూహ్యంగా తెలంగాణవైపు దిశ మార్చుకోవడంతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ తుపాను కోస్తాంధ్ర నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాల వైపు వెళ్తుందని భావించారు.
అందుకు భిన్నంగా దిశ మార్చుకుంది. ఉత్తరాంధ్ర, తెలంగాణ సరిహద్దుల మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతోంది. ఈ ప్రభావంతో కురిసిన వర్షాలకు హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు వణికిపోయాయి. తుఫాన్ కొంత బలహీనపడిన వాయుగుండంగా మారింది. ఇవాళ సాయంత్రానికి వాయుగుండం పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వర్షాలకు పలు జిల్లాల్లో వరి వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. పలు చోట్ల కోసిన పంట వరదకు కొట్టుకుపోయింది. పత్తి, మక్కలు నీట తడవడంతో రైతులు తేమశాతంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైళ్లు స్టేషన్లలో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు రైళ్లను దారి మళ్లించారు. బస్టాండ్లలోకి నీరు చేరడంతో చాలా జిల్లాల్లో బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది.