జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి.. రాష్ట్రపతి ఎన్నికలే టార్గెట్...

KCR: బీజేపీకి చెక్ పెట్టేలా విపక్షాలతో కలిసి వ్యూహాలు

Update: 2022-05-23 07:28 GMT

జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి.. రాష్ట్రపతి ఎన్నికలే టార్గెట్...

KCR: గులాబీ బాస్ కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. గంతలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్, పీవీ నర్సింహరావు లాంటి దిగ్గజ నేతలు జాతీయ స్థాయి రాజకీయాల్లో రాణించారు. ఇప్పుడు తనకంటు ప్రత్యేక ఇమేజ్ కోసం కేసీఆర్ బీజేపీ సర్కార్‌ను ఢీకొడుతున్నారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయి రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయనే అంచనాలో ఉన్న కేసీఆర్. తాను ఎక్కడ వెనుక బడకుండా తన వంతూ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో తనకంటూ ఓ ఇమేజ్‌ని సెట్ చేసుకునే పనిలో పడ్డట్టు చర్చ జరుగుతోంది.బీజేపీని చెక్ పెట్టేలా విపక్షాలతో కలిసి వ్యూహాలు

130 కోట్ల జనాభా గల భారత దేశ రాజకీయాల్లో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సక్సెస్ అయిన మోడీ... జాతీయ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్నారు. పాలనతో తనదైన ఇమేజ్‌తో దేశం మొత్తాన్న తనవైపు చూసేలా చేశారు. సొంత బీజేపీ పార్టీలో కూడా మోడీని కాదనలేని పరిస్థితి కల్పించి వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. బీజేపీ సర్కారుతో తొలుత సానుకూలంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్... ఆ తర్వాత అందుకు భిన్నమైన వైఖరిని తీసుకొని అడుగులు వేస్తున్నారు. గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ హడావుడి చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రెంట్ అంటూ దేశ మంతా తిరిగారు. కానీ అప్పుడు మోడీ సర్కార్ మరోసారి తిరుగులేని విజయం సాధించడంతో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.

దేశంలో ఇప్పుడు మోడీ చరిష్మా తగ్గుతోంది. రోజు రోజు బీజేపీ సర్కార్ పాలనపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందనే అంచనాలో ఉన్న కేసీఆర్ మరోమారు జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలతో తరుచూ చర్చలు చేస్తున్న కేసీఆర్ ఈసారి ఏకంగా పంజాబ్ బాట పట్టారు. అక్కడి రైతు ఉద్యమంలో చనిపోయిన అమరులకు... గాల్వాన్ లోయలో చనిపోయిన సైనికులకు... తెలంగాణ సర్కార్ తరుపున చెక్కులు అందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించారు. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌తో మంతనాలు చేస్తూ నేషనల్ వైడ్‌గా ఫోకస్ అయ్యారు.

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ మరింతగా దూకుడు పెంచారు. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని పదేపదే చెబుతున్నారు. వివిధ రంగాల ప్రముఖలతో చర్చలు జరుపుతున్నారు. ఇదే సందర్భంలో ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్‌తో కలిసి పాఠశాల సందర్శించిన తర్వాత కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. త్వరలో దేశంలో సంచలనం జరగబోతుందని ప్రకటించారు. అయితే కేసీఆర్ ఇలాంటి సంచలనాలను ప్రకటించడం కొత్త కాదు. కానీ ఈసారి గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టు కన్పిస్తోంది. గతంలో మూడో ఫ్రంట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించి విఫలమైన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారనే విషయం ఆసక్తిగా మారింది.

అయితే త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు యూపీఏ పక్షాలు రంగం సిద్ధం చేసుకుంటున్నవేళ... కేసీఆర్ సైతం అందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చర్చ సాగుతోంది. జాతీయ స్థాయిలో తనకంటూ ఓ ఇమేజ్ నిర్మించుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు కలిసి వస్తే జాతీయ స్థాయి రాజకీయాల్లో కూటమితో చక్రం తిప్పాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. అందుకోసం ఆయన అన్ని ప్రాంతీయ పార్టీల నేతల మద్దతు కూటగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 

Tags:    

Similar News