బీజేపీ కార్పొరేటర్లపై కన్నేసిన టీఆర్‌ఎస్‌.. కండువా మార్చి టీఆర్‌ఎస్‌లోకి లాగేందుకు..

TRS vs BJP: *మంత్రి సబితా సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన నరేంద్ర *నరేంద్ర బాటలో మరికొంతమంది..?

Update: 2022-01-01 05:00 GMT

బీజేపీ కార్పొరేటర్లపై కన్నేసిన టీఆర్‌ఎస్‌.. కండువా మార్చి టీఆర్‌ఎస్‌లోకి లాగేందుకు..

TRS vs BJP: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో బలపడాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తుంటే.. కమలం పార్టీని బలహీనపరిచి.. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని గులాబీ పార్టీ ఎత్తులేస్తోంది. గ్రేటర్‌ పరిధిలో గెలిచిన కాషాయ పార్టీ కార్పొరేటర్లను కారెక్కించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే శివారు మున్సిపాలిటీలోని పలువురు బీజేపీ కార్పొరేటర్లకు గులాబీ కండువా కప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు టీఆర్‌ఎస్‌ నేతలు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో బీజేపీ సత్తా చాటడంతో అనేక డివిజన్లలో టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతున్నాయి. దీంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నగరంలో తమ ప్రభావం కోల్పోకుండా జాగ్రత్త పడుతోంది గులాబీ పార్టీ. ఇందులో భాగంగానే బీజేపీ కార్పొరేటర్లతో మంతనాలు జరుపుతున్న టీఆర్‌ఎస్‌.. గాళం వేసి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

తాజాగా.. మీర్‌పేట్‌ 13వ డివిజన్ కార్పొరేటర్ నరేంద్రకుమార్ పార్టీ మారారు. కమలం గుర్తుపై గెలిచిన ఆయన.. గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై కమలం పార్టీ గుర్రుగా ఉంది. అధికారం అడ్డం పెట్టుకొని తమ నేతలను గులాబీ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాషాయం నేతలు.

ఇదిలా ఉంటే.. నరేంద్రకుమార్‌ లానే.. మరికొంతమందిని తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహ రచన చేస్తోంది గులాబీ పార్టీ. మీర్‌పేట్‌, బడంగ్‌పేటలో గెలిచిన బీజేపీ కార్పొరేటర్ల కండువాలను మార్చేపనిలో పడింది.

Tags:    

Similar News