TRS Formation Day: నేటితో టీఆర్ఎస్‌కు 20 ఏళ్లు.. గమ్యాన్ని ముద్దాడిన టీఆర్ఎస్
TRS Formation Day: ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ నేటితో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది.
TRS Formation Day: నేటితో టీఆర్ఎస్‌కు 20 ఏళ్లు.. గమ్యాన్ని ముద్దాడిన టీఆర్ఎస్
TRS Formation Day: ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ నేటితో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. నిధులు, నీళ్లు, నియామకాలు నినాదంతో 2001 ఏప్రిల్ 27న ప్రారంభమైన టీఆర్ఎస్ 14 ఏళ్ల పాటు ఉద్యమ బాటలో నడిచింది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్ర సాధనకు సర్వశక్తులూ ఒడ్డిన టీఆర్ఎస్ 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికారం చేపట్టింది.
ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలతోపాటు ఎజెండాలో లేని ఇతర పథకాలను కూడా అమలు చేస్తూ 2018లో వరుసగా రెండోసారి కూడా టీఆర్ఎస్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఉద్యమ పార్టీగా, రాష్ట్ర సాధన తర్వాత అధికార పార్టీగా రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్ ప్రస్థానం కొనసాగుతోంది.
పదవీ త్యాగపునాది మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుందని బలంగా నమ్మిన కేసీఆర్ అదే విజన్‌తో 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఇక టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవడమంటే కేసీఆర్ జీవిత చరిత్ర గురించి చెప్పుకోవడమే.
చెప్పాలంటే చాలా మంది చరిత్ర నుంచి ప్రభావితమవుతారు. కొందరే చరిత్రను ప్రభావితం చేస్తారు. అలాంటి వారిలో కేసీఆర్ ఒకరు. తెలంగాణ సమాజాన్ని ఊగించి, ఉరికించి, శాసించి విజయతీరాలకు చేర్చారు. నిజానికి ఆయన ఉక్కు సంకల్పం, వ్యూహ చతురత ముందు ఆవిధి సైతం తలవంచింది. తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీ.. రాజకీయ పార్టీగా అవతరించింది. సబ్బండ వర్గాలందరికీ గులాబీ జెండా నీడైంది.