కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలుస్తోన్న ఆదివాసీలు

ఆ ఆదివాసీల గూడాల్లో పోలీస్‌ పహారా లేదు.. కరోనాపై అధికారులు అవగాహన కల్పించింది లేదు...

Update: 2020-06-22 10:27 GMT

ఆ ఆదివాసీల గూడాల్లో పోలీస్‌ పహారా లేదు.. కరోనాపై అధికారులు అవగాహన కల్పించింది లేదు... కానీ గూడెంలో ఎటు చూసినా కర్ఫ‌్యూ వాతావరణం కనిపిస్తోంది. కరోనాను ఎట్టి పరిస్థితుల్లోనూ దరి చేరనీయొద్దనే సంకల్పంతో.. స్వీయ నియంత్రణను కఠినంగా అమలు చేస్తున్నారు గిరిజనులు. స్వతహాగా కర్ఫ్యూ పాటిస్తూ స్ఫూర్తినిస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులతో రాష్ట్రమంతా సాధారణ పరిస్థితులు ఏర్పడినా.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కొత్తూరు, మర్లవాయి ఆదివాసి గూడాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.

కరోనాపై పోరాటానికి సంకల్పించిన గూడెం వాసులు నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. గూడెంలోకి ఎవరూ రాకుండా.. గూడెం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం చెక్‌పోస్టులు పెట్టి నిరంతర నిఘాను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆ గ్రామాల్లోని ఆదివాసీలెవ్వరూ అడుగు తీసి బయటకు వెళ్లడం లేదు. ఓ వైపు కూరగాయలు, నిత్యావసర వస్తువుల కోసం జనం క్యూ‌లు కడుతుంటే ఇక్కడి గిరిజనులు మాత్రం వస్తు మార్పిడిని పాటిస్తున్నారు. ఒకరి దగ్గర ఉన్న వస్తువులను మరొకరికి ఇచ్చుకుంటూ కొరతను తీర్చుకుంటున్నారు.

సాధారణంగా ఆదివాసీలకు షేక్‌ హ్యాండ్‌ అలవాటు ఉండదు. రామ్‌ రామ్‌ అంటూ అందరినీ పలకరించుకుంటారు.ఇది వారి సంప్రదాయం. దీంతో పాటు గూడాల్లో భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు గిరిజనులు. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లినా శుభ్రతను పాటిస్తున్నారు. స్వీయ నియంత్రణతోనే కరోనా మహమ్మారిని నిర్మూలించవచ్చంటున్న ఆదివాసీలు... కొవిడ్‌పై సమరంలో ఎన్నాళ్లైనా ఇదే సంకల్పం కొనసాగిస్తామంటున్నారు. 


Tags:    

Similar News