Narendra Modi: రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

* మోడీ స్పీచ్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ

Update: 2023-04-07 04:39 GMT

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వందే భారత్ రైలు ప్రారంభం.. ఆధునీకరణ పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు హీటెక్కిన నేపథ్యంలో.. మోడీ హైదరాబాద్‌ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. మోడీ స్పీచ్‌పైనా ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో బీఆర్ఎస్ నేతలు నిరసనలకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రధాని పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

రేపు ఉదయం 11:30 గంటలకు ప్రధాని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. సుమారు 2గంటల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 5 నిమిషాల వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వందే భారత్ ట్రైన్‌ను ప్రారంభించి.. పలు కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు. అనంతరం 12 గంటల 15 నిమిషాల నుంచి పరేడ్ గ్రౌండ్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. దాదాపు అరగంట పాటు ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారాలు బీఆర్ఎస్, బీజేపీ మధ్య కాకరేపుతున్నాయి. TSPSC పేపర్ లీక్‌పై అధికార పార్టీకి సంబంధం ఉందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే.. కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తే.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పుతో వ్యవస్థను బద్నాం చేయడం కరెక్ట్ కాదని బీఆర్ఎస్ మండిపడుతోంది.

ఇక టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో మరోసారి రెండు పార్టీల మధ్య అగ్గి రాజేసింది. వరంగల్‌లో పేపర్ లీక్‌ కేసులో ఏ2గా ఉన్న ప్రశాంత్‌.. బండి సంజయ్‌కి ప్రశ్నపత్రం పంపడం తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కించింది. పేపర్ బయటకి తీసుకువచ్చింది ఒకరైతే.. పంపించిన వారిని ఈ విధంగా అరెస్టు చేస్తారని బీజేపీ ప్రశ్నించింది. కుట్రపూరితంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు.

ఇక మోడీ పర్యటనలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపారు. మోడీ అధికారిక సభలో మాట్లాడడానికి కేసీఆర్‌కు 7 నిమిషాల సమయం కేటాయించారు. అయితే కొంతకాలంగా మోడీ పర్యటనకు దూరంగా ఉంటోన్న కేసీఆర్.. రేపు వస్తారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు తెలంగాణ రాజకీయాలపై మోడీ ఎలాంటి ప్రసంగం చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News