Panchayat Elections: ఉపసర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్.. జాయింట్ చెక్ పవర్ ఉండటమే కారణమా..?
Panchayat Elections: గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి ఊపందుకుంది. సర్పంచ్ పదవికి ఫుల్ గిరాకీ ఉండేది.
Panchayat Elections: గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి ఊపందుకుంది. సర్పంచ్ పదవికి ఫుల్ గిరాకీ ఉండేది. ఇప్పుడు ఉప సర్పంచ్ పదవికి కూడా ఫుల్ డిమాండ్ పలుకుతోంది. రిజర్వేషన్లు కలిసిరాని చోట్ల, వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవాలని పోటీపడుతున్నారా ?. సర్పంచ్,ఉప సర్పంచ్‌కు ‘జాయింట్ చెక్ పవర్’ ఉండటమే దీనికి ప్రధాన కారణమా!? పదవి దక్కించుకునేందుకు ఖర్చుకు కూడా వెనకాడటం లేదా !? వార్డు సభ్యులను తమ వైపు తిప్పుకోవడానికి ఆఫర్లు ఇస్తున్నారా!? ఒకప్పుడు అంత ప్రాధాన్యం లేని ఈ పోస్టుకు ఇప్పుడు ఊహించని స్థాయిలో ఫుల్ గిరాకీ ఎందుకు?
వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారు ఉపసర్పంచ్ పదవిపై ఫోకస్ పెట్టారు. ఉపసర్పంచ్ పోస్టు కోసం గ్రామాల్లో హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. సర్పంచ్ పదవిని ఆశించి రిజర్వేషన్ల ఎఫెక్ట్ తో ఇప్పుడు ఉపసర్పంచ్ పదవికోసం ప్రయత్నిస్తున్నారు.దీంతో సర్పంచ్ పదవే కాదు. సర్పంచ్ పదవి కోసం రిజర్వేషన్లు కలిసిరాని చోట ఆశావహులు వార్డు మెంబర్స్ చేసి పోటీ చేసి గెలిచి, ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. పంచాయతీ నిధులు, బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్, సెక్రటరీతో పాటు ఉప సర్పంచ్‌కు కూడా ‘జాయింట్ చెక్ పవర్’ ఉండటమే దీనికి కారణం. అందుకే ఈ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. అందుకే ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకునేందుకు ఎంతైకైనా రెడీ అంటున్నారు.
గ్రామంలోని అభివృద్ధి పనులు, నిధుల పర్యవేక్షణ, నిర్ణయాల్లో భాగస్వామ్యంతో ఉపసర్పంచ్ బాధ్యతలు పెరగడంతో ఈ పదవి ప్రాధాన్యత పెరిగింది. సర్పంచ్‌తో సమానంగా గ్రామ పాలనలో కీలకస్థానం దక్కుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. సర్పంచ్ పదవికి 10లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఉపసర్పంచ్‌కు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేసేందుకు కూడా రెడీ అంటున్నారు. గతంలో సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య గొడవలు జరిగాయి. ముఖ్యంగా చెక్ పవర్ విషయంలో ఇరువురికి పడక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఒకానొక దశలో ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు చేయాలంటూ సర్పంచ్‌లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. గత ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థులు సర్పంచ్‌గా గెలిచిన తర్వాత చెక్ పవర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తమ మాట వినే వారినే వార్డు సభ్యులుగా గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అవసరమైతే వారి ఎన్నికల ఖర్చులు భరించేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ఉప సర్పంచ్ పదవి కూడా తమ వర్గం వారికే దక్కేలా ప్లాన్ చేస్తున్నారు.
ఖర్చు తక్కువ... పవర్ ఎక్కువ... ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్ పెరిగింది. కొత్త కొత్త ఎత్తుగడలతో పలుచోట్ల సర్పంచ్ కావాలనుకున్న నాయకులకు రిజర్వేషన్ మూలంగా పదవులు దక్కకపోవడంతో వారంతా ఉప సర్పంచ్ మీద కన్నేశారు. దీనికోసం పెద్ద ఎత్తున భేరాసారాలు సాగుతున్నాయి. సర్పంచి, వార్డు సభ్యుల ప్రచార ఖర్చులను భరించడం.. ముందే తమకు సరిపడా బలాన్ని ఏకగ్రీవం చేసుకోవడం వంటివి కొనసాగిస్తున్నారు. రిజర్వుడు పంచాయతీల్లో సర్పంచి అభ్యర్థుల ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే. ఇది ఉప సర్పంచి ఆశావహులకు కలిసి వస్తోంది. ‘వార్డు సభ్యుల గెలుపునకు ఖర్చులు పెట్టుకుంటాం. వార్డు పదవి మీకు.. ఉప సర్పంచి పదవి మాకు’ అనే షరతుతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో వార్డు సభ్యులు సైతం ఖర్చులు కలిసి వస్తాయని ఒప్పేసుకుంటున్నారు. మహిళలకు రిజర్వేషన్లు దక్కిన చోట కూడా వార్డు సభ్యులుగా గెలుపొందేందుకు ఏ వార్డు అనుకూలమో చూసుకుంటున్నారు. కొందరు రెండు, మూడు వార్డులకూ నామినేషన్ వేశారు.
ఇక స్థానిక గ్రూపులు, కుల సంఘాలు, రాజకీయ నాయకుల్లోనూ ఉపసర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ముందెన్నడూ లేనంత ఉత్సాహం కనిపిస్తోంది.మహిళలకు రిజర్వేషన్లు దక్కిన చోట కూడా వార్డు సభ్యులుగా గెలుపొందేందుకు ఏ వార్డు అనుకూలమో చూసుకుంటున్నారు.దీంతో కరీంనగర్ ఇల్లంతకుంట సర్పంచి ఎస్సీ జనరల్. దీంతో ఇక్కడ 12 వార్డుల్లో ఏడుగురు వార్డు సభ్యులను తనకు అనుకూలంగా మలచుకునేందుకు ఒక్కొక్కరికి 40 వేల చొప్పున ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇదే మండలం కందికట్కూరులోనూ కుల సంఘాలను ఏకం చేసి తన బలం నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.కోనరావుపేట మండలం ఎగ్లాస్‌పూర్ ఎస్సీ జనరల్. ఉప సర్పంచి పదవి ఆశించిన అభ్యర్థి గ్రామంలోని ఎనిమిది వార్డుల్లో అయిదు వార్డులను ఇప్పటికే ఏకగ్రీవం చేసుకున్నారు. ఇక పోలింగ్ పూర్తవుడే ఆలస్యం ఉప సర్పంచి సీట్లో కూర్చునేందుకు సిద్ధమయ్యాడు. ఉప సర్పంచి పదవి ఆశించేవారు గ్రామాల్లో తమ ప్యానెల్ వార్డు సభ్యులను గెలిపించుకునేందుకు ఒక్కొక్కరు 10 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
ఈసారి గ్రామాల్లో కేవలం సర్పంచ్ పదవికి మాత్రమే డిమాండ్ అనుకుంటే పొరపాటు.. సర్పంచ్ పదవితో పాటు ఉపసర్పంచ్ పదవికీ కూడా అంతే హీట్, అంతే రాజకీయ వేడి. పోటాపోటీగా తాయిలాలు, ప్రలోభాలకు అవకాశం లేకపోలేదు. సర్పంచ్ కావాలని ఆశపడి రిజర్వేషన్ అడ్డంకితో భంగపడిన వారి ప్రధాన లక్ష్యం ఉప సర్పంచ్ పదవిగా మారిపోయింది.