Telangana Local Body Polls: సర్పంచ్ బరిలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి.. 95ఏళ్ల వయస్సులో తగ్గేదే లే అంటున్న రామచంద్రారెడ్డి
Telangana Local Body Polls: గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక రాజకీయాల ప్రభావంతో హీటెక్కుతాయి.
Telangana Local Body Polls: సర్పంచ్ బరిలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి.. 95ఏళ్ల వయస్సులో తగ్గేదే లే అంటున్న రామచంద్రారెడ్డి
Telangana Local Body Polls: గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక రాజకీయాల ప్రభావంతో హీటెక్కుతాయి. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ ఎన్నిక మాత్రం ఇప్పుడు యావత్ రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. మాజీ మంత్రి, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తండ్రి సర్పంచ్ పదవికి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. 95 ఏళ్ల వయస్సులోనే తగ్గేదే లే అంటున్నారు గుంటకండ్ల రామచంద్రా రెడ్డి. వృద్ధాప్యం ప్రభావం చూపకుండా యువకుడిలాగా ఆయన గ్రామమంతా కలియతిరుగుతూ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తుండడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్ స్థానం జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయింది. తమ కుటుంబ రాజకీయ ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తన తండ్రిని బరిలోకి దింపారు. పంచాయతీ ఎన్నికలను కేవలం స్థానిక పోరుగా కాకుండా, తమ రాజకీయ బలానికి ఒక పరీక్షగా ఆయన పరిగణిస్తున్నారు. రామచంద్రా రెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవాలని జగదీశ్వర్ రెడ్డి గట్టి ప్రణాళికలు రచిస్తున్నారట..ఒక ఎమ్మెల్యే తండ్రి సర్పంచ్‌గా గెలవడం అనేది బీఆర్‌ఎస్‌కు జిల్లాలో బలమైన సానుకూల సంకేతం పంపుతుందని గులాబీ దళం భావిస్తోందట..అందుకే, ఎమ్మెల్యే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికలో గెలుపు అనేది కుటుంబ ప్రతిష్టకు, రాజకీయ పరువుకు సంబంధించినదిగా మారింది.
నాగారం గ్రామ పంచాయతీలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య 2448. ఇందులో పురుషులు 1185, స్త్రీలు 1262, ఒక ట్రాన్స్ జెండర్ ఓటరు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. రామచంద్రా రెడ్డికి ప్రధాన పోటీదారులుగా ఇద్దరు ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ రెబల్‌గా మరొకరు బరిలో ఉండడం, నాగారంలో ఓటు చీలిక రాజకీయాలకు తెర లేపింది. సాధారణంగా అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలితే, అది పరోక్షంగా బీఆర్‌ఎస్ అభ్యర్థి రామచంద్రా రెడ్డికి మేలు చేసే అవకాశం ఉంటుంది.
తన తండ్రి గుంటకండ్ల రామచంద్రా రెడ్డిని సర్పంచ్‌గా గెలిపించుకోవడానికి జగదీశ్‌రెడ్డి నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగంలోకి దించుతున్నారు. ఇది కేవలం సర్పంచ్ ఎన్నిక కాదు, తన నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పట్టును తిరుగులేని విధంగా చాటిచెప్పడానికి ఎమ్మెల్యే పన్నిన ఒక రాజకీయ వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు.