Ramappa Temple: రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై టీఎస్ హైకోర్టు విచారణ
Ramappa Temple: ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప గుర్తింపు పొందడం ప్రశంసనీయం -హైకోర్టు
రామప్ప దేవాలయం (ఫైల్ ఇమేజ్)
Ramappa Temple: ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప గుర్తింపు పొందడం.. తెలంగాణకు గర్వకారణమని టీఎస్ హైకోర్టు ప్రశంసించింది. ప్రపంచ పటంలో స్థానం లభించడం గర్వకారణమంది. రామప్ప కట్టడం చారిత్రకంగా అత్యంత విలువైనదని, ప్రపంచ అంచనాలకు అనుగుణంగా రామప్పను తీర్చిదిద్దాలని ఆదేశించింది. యునెస్కో విధించిన గడువులోగా కార్యాచరణ చేపట్టి శాశ్వత గుర్తింపు దక్కించుకోవాలని సూచించింది. కాల పరిమితులు విధించుకొని పని చేయాలని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుందని హెచ్చరించింది.
రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై హైకోర్టులో విచారణ జరిగింది. పత్రిక కథనాలపై సుమోటోగా విచారణ చేపట్టిన హైకోర్టు యునెస్కో విధించిన గడువులోగా సమగ్ర సంరక్షణ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించింది. ఏఎస్‌ఐ, రాష్ట్ర పురావస్తుశాఖ, కలెక్టర్‌తో కమిటీ ఏర్పాటు చేయాలన్న ధర్మాసనం ఆగస్టు 4న కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో కమిటీ నివేదిక సమర్పించాలని సూచించింది. రామప్ప అభివృద్ధి అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తామన్న హైకోర్టు తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా వేసింది.