Telangana: సర్పంచ్, MPTC ఎన్నికలపై అప్డేట్.. ఎస్ఈసీకి కీలక ప్రతిపాదన

Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) పంచాయతీరాజ్ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది.

Update: 2025-07-27 02:37 GMT

Telangana: సర్పంచ్, MPTC ఎన్నికలపై అప్డేట్.. ఎస్ఈసీకి కీలక ప్రతిపాదన

Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) పంచాయతీరాజ్ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. గతంలో మూడు దశల్లో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను ఈసారి కేవలం రెండు దశల్లోనే నిర్వహించాలన్న నిర్ణయాన్ని శాఖ వెల్లడించింది.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులను సన్నద్ధం చేయాలని సీఈఓలు, డీపీవోలతో ఆదేశాలు జారీ చేసింది. బ్యాలెట్ బాక్సుల లభ్యత, అవసరమైతే అదనపు బాక్సుల అవసరం వంటి అంశాలపై సమీక్షించి ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించింది.

ఓటర్ల తుది జాబితాపై ప్రత్యేక దృష్టి

ఓటర్ల తుది జాబితా రూపొందించడం ఎన్నికల నిర్వహణలో కీలక ప్రక్రియ కావడంతో, పంచాయతీరాజ్ శాఖ దానికి ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మళ్లీ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎంపీడీవోల లాగిన్ ద్వారా టీపోల్‌ పోర్టల్‌లో జాబితా నమోదు చేసినప్పటికీ, పంచాయతీలు, వార్డుల సంఖ్య మారిన నేపథ్యంలో మరోసారి జాబితా సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

జాబితాలో మార్పులు – ఓటర్ల సంఖ్య పెరిగే సూచనలు

ముందుగా రూపొందించిన జాబితా ఆరు నెలల వ్యవధిని దాటినందున, ఆ జాబితాలోని మృతుల వివరాలు తొలగించనున్నారు. అదే సమయంలో, ఈ మధ్యకాలంలో కొత్తగా ఓటు నమోదు చేసుకున్నవారిని వారి కుటుంబ సభ్యుల పోలింగ్ బూత్ పరిధిలో జత చేస్తారు. దీంతో పాత సీరియల్ నంబర్లు మారే అవకాశముంది.

2025 మార్చిలో విడుదలైన సాధారణ జాబితా తర్వాత ఓటు నమోదు చేసుకున్నవారికి కూడా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు. ఈ చర్యల కారణంగా ఓటర్ల సంఖ్యలో పెరుగుదల జరిగే అవకాశం ఉన్నది.

రాజకీయ పార్టీలలో కదలికలు

ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం, త్వరలో పూర్తి షెడ్యూల్ విడుదల చేసే అవకాశముంది.

Tags:    

Similar News