Locust Attack: గాలి ఎటువీస్తే అటువైపే పయనం : ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు చెరుకూరి

కొద్ది నెలలుగా ఉత్తర భారతాన్ని వణికించిన మిడతలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వైపు పయనం మొదలు పెట్టాయన్న విషయం తెలిసిందే.

Update: 2020-05-31 08:02 GMT

కొద్ది నెలలుగా ఉత్తర భారతాన్ని వణికించిన మిడతలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వైపు పయనం మొదలు పెట్టాయన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోకి ప్రవేశించిన మిడతల దండు తెలుగు రాష్ట్రాల వైపు పరుగులు పెడుతున్నాయి. మేము వస్తున్నాం కాచుకోండి అంటూ ఇటు రైతులకు, అటు అధికారులకు సవాల్ విసురుతున్నాయి మిడతలు.

అయితే ఈ మిడతల గురించి బాపట్లలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రిమికీటక శాస్ర్తాల ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు చెరుకూరి కొన్ని విషయాలను తెలిపారు. మిడతలు గాలి ఎటువైపు బలంగా వీస్తే మిడతలు అటువైపు ప్రయాణిస్తాయని ఆయన చెప్పారు. మరి కొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు మొదలవుతాయని అప్పుడు గాలివాటంగా మిడతలు తిరిగి రాజస్థాన్‌ వైపు వెళ్తాయని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిన మిడతల కారణంగా పశ్చిమ, మధ్యభారతంలో ఎంతో మంది రైతులు పంటలను నష్టపోయారు. దీంతో దక్షిణ రాష్ట్రాలపై కూడా మిడతలు దాడి చేసి పంటలు నష్టపరుస్తాయని రైతులు భయపడుతున్నా నేపథ్యంలో వాటి పయనం గురించి శ్రీనివాసరావు అవగాహన కల్పిస్తున్నారు.

ఈ ఏడాది ఆఫ్రికా, ఇరా న్‌, పాకిస్థాన్‌లో ఉన్న ఎడారి ప్రాంతాల్లో పడిన వానల వల్ల ఎడారి మిడతల సంతానోత్పత్తి భారీగా పెరిగిందని ఆయన పెరిగారు. వాటి దండులో సుమారుగా ఐదారు కోట్ల మిడతలు ఉంటాయని చెప్పారు. వాటికి అక్కడ ఆహారం లభించకపోవడంతో అవి ఆహారం కోసం పాకిస్థాన్‌ నుంచి రాజస్థాన్‌ వైపు వచ్చాయని ఆ గాలి ఎటు వీస్తే అటు అవి ప్రయాణం చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ మిడతలు ఒక దండులా ప్రయాణిస్తాయని, గంటకు 12-15 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని తెలిపారు. ఇవి చెట్ల మీద ఆవాసం ఏర్పరుచుకొని పంటలకు భారీ నష్టం కలిగిస్తాయని స్పష్టం చేసారు. వీటి జీవితచక్రంలో గుడ్డు, రెక్కలు లేని అపరిపక్వ దశ, రెక్కలున్న ప్రౌఢదశలు ఉంటాయని స్పష్టం చేసారు. పక్కదేశాల్లో మిడతల ఉధృతిని అంచనావేసి ఎప్పటి కప్పుడు సమాచారాన్ని ఇస్తూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే మిడతల హెచ్చరిక సంస్థ అధికారులను అప్రమత్తం చేస్తుందని తెలిపారు. మిడతల ఉధృతి పెరిగితే హెలికాప్టర్ల ద్వారా మలాథియాన్‌ అనే రసాయనాన్ని పిచికారి చేసి సంహరిస్తారన్నారు.

ఇక ప్రస్తుతం మిడతలు మహారాష్ట్రలో ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమయింది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల బృందం ఆదిలాబాద్ చేరుకుంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఏరియల్ వ్యూ నిర్వహించనుంది. మధ్యాహ్నం ఆదిలాబాద్ లో అధికారులతో బృందం సభ్యులు సమావేశం నిర్వహిస్తారు.

Tags:    

Similar News