గత ప్రభుత్వానికి ఇదే నా సూటి ప్రశ్న... సమాధానం చెప్పండి - రేవంత్ రెడ్డి
గత ప్రభుత్వానికి ఇదే నా సూటి ప్రశ్న...సమాధానం చెప్పండి - రేవంత్ రెడ్డి
Revanth Reddy about unemployment in Telangana: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. "తెలంగాణ సాధించుకున్న తరువాతే మా సొంత రాష్ట్రంలో మేము ఉద్యోగాలు తెచ్చుకుంటామని చెప్పి మరీ యువత ఉద్యమంలో పాల్గొంది. అలా ఎంతోమంది నిరుద్యోగులు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదు" అని అన్నారు.
"గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. వారి నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పటికీ 20 నుండి 25 లక్షల మంది నిరుద్యోగులు, పట్టభద్రులు హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక క్యాలెండర్ ఇయర్ ప్రకారం కొలువులను భర్తీ చేస్తూ వస్తోంది" అని రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కొలువుల పండగలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
పదేళ్లలో గత ప్రభుత్వం చేయలేని పనిని పది నెలల్లో తమ ప్రభుత్వం చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్‌ను ముందుకు తీసుకెళ్లి ఖాళీలను భర్తీ చేయడంలో ఎందుకు విఫలమైందో సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పదేళ్లలో నోటిఫికేషన్స్ ఇవ్వలేదని, ఇచ్చిన నోటిఫికేషన్స్‌లో కొన్ని కోర్టు కేసుల పాలయితే, ఇంకొన్నింటికి జీరాక్స్ షాపులలో ప్రశ్న పత్రాలు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
"కొన్ని పరీక్షలకు సంబంధించి ఫలితాలు వెల్లడించలేదు.. ఇంకొన్ని కోర్టు కేసులతో ఆగిపోయాయి. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ చిక్కుముడులన్నింటిని విప్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేదు" అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.