Telangana Budget 2025: నేడు తెలంగాణ బడ్జెట్..భారీగా పెరిగిన అంచనాలు..పూర్తి వివరాలివే
Telangana Budget 2025: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ సారి సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే బడ్జెట్ లెక్కలు కూడా భారీగా ఉన్నాయి. ప్రభుత్వంపై చాలా ఒత్తిడి ఉంది. హామీల అమలుకు సంబంధించి ప్రతిపక్షాలు రోజుకో రకంగా ధర్నాలు, ఆందోళనలూ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్ధితుల మధ్య ప్రభుత్వం భారీ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. మొత్తం 3.15లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ఉండబోతోందని తెలిసింది. అంటే ఇది వరకు బడ్జెట్ కంటే ఇది 7శాతం ఎక్కువ. కాగా 2024-25 బడ్జెట్ రూ. 2.20లక్షల కోట్లు. దాన్ని మించి ఈ బడ్జెట్ ఉంటుందని తెలియడంతో ఇది అమలుకు సాధ్యమేనా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
బడ్జెట్ కు ముందు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఉదయం 9.30కి అసెంబ్లీ కమిటీ హాల్ లో ఉంటుంది. ఇందులో బడ్జెట్ ను ఆమోదిస్తారు. ఆ తర్వాత ఉదయం 11.15కి డిప్యూటీ సీఎం తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క..ఈ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అలాగే అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్ బాబు, శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నిక సమయంలో ఆరు గ్యారంటీల హామీ ఇచ్చింది. వాటిలో చాలా వరకు అమలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. అయితే అమలు చేయని హామీలు చాలానే ఉన్నాయి. అలాగే అమలు చేస్తున్న వాటిలో కూడా కొన్ని పథకాల విషయంలో గందరగోళం నెలకొంది. ఇవన్నీ ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో పద్దును పెంచడం ద్వారా ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే పద్దును పెంచడం తేలికే కానీ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తోందో కూడా చెప్పాలి. అది అసలు సవాలుగా ఉంటుంది. రెవెన్యూ రాకపోతే అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో అప్పులు ఎక్కువయ్యాయి. అందవల్ల ఈ బడ్జెట్ ను భట్టి విక్రమార్క ఎలా డీల్ చేశారన్నది ఆసక్తికరంగా మారింది.