Telangana BJP: సోషల్ మీడియా వార్.. బీజేపీ కౌంటర్ అటాక్‌కు సిద్ధం
పార్లమెంట్ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా సీట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ప్రత్యామ్నాయంగా మారాలని తాపత్రయం సోషల్ మీడియా వేదికగా కమలం పార్టీకి ప్రత్యర్థుల నుంచి విమర్శలు
Telangana BJP: సోషల్ మీడియా వార్.. బీజేపీ కౌంటర్ అటాక్‌కు సిద్ధం
తెలంగాణ బీజేపీ నేతలు రూట్ మార్చనున్నారా..? ఇక నుంచి దూకుడుగా వెళ్లనున్నారా...? సోషల్ మీడియాలో పార్టీపైన, నేతలపైన దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలకు, దీటైనా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారా..? పార్టీ కేడర్‌కు కమల సారథి ఆ దిశగా దిశానిర్దేశం చేశారా...? అందులో భాగంగానే సోషల్ మీడియాను బలోపేతం చేస్తున్నారా...? ఇకపై సొంత పార్టీ నేతలైనా..క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పావా...? ఇంతకు రామచందర్ రావు పార్టీ బలోపేతం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటీ....
తెలంగాణలో బీజేపీ గతంతో పోల్చితే.. ప్రస్తుతం బలంగానే ఉందని చెప్పవచ్చు. ప్రజాధారణ ఉన్న నేతలకు కొదవలేదు. పార్లమెంట్ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా సీట్లు ఉన్నాయి. దానికి తోడు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడం అదనపు బలం. రాబోయే ఎన్నికల నాటికి కాంగ్రెస్ సర్కార్‌కు ప్రత్యామ్నాయంగా మారాలని తాపత్రయ పడుతోన్న కమలం పార్టీకి ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురుదాడులు, అసత్య ఆరోపణలు, విమర్శలు ఎక్కువయ్యాయి. హస్తం పార్టీ, కారు పార్టీ సోషల్ మీడియాలకు కమలం పార్టీ టార్గెట్‌గా మారుతోంది. మరోవైపు ప్రత్యర్థుల ఆరోపణల కంటే...సొంత పార్టీలోనే ఉంటూ పార్టీపైన, నేతలపైన కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వారి కారణంగానే పార్టీకి మరింత నష్టం కలిగే ప్రమాదం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తుంది.
రాష్ట్రంలో కమలం పార్టీ ఎదుగుతున్న క్రమంలో కొందరు నేతలు పని కట్టుకొని సోషల్ మీడియా వేదికగా చేసే తప్పుడు ప్రచారంతో పార్టీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. అందుకే ఇక నుంచి బీజేపీ సోషల్ మీడియాను బలోపేతం చేయడంతో పాటు...లీగల్ సెల్‌ను యాక్టివ్ చేయాలని కమలనాథులు ఆలోచన చేస్తున్నారు. అధ్యక్షుడితో పాటు పార్టీలోని ఏ ఒక్క ముఖ్యనేతపై సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ఆరోపణలు చేసినా.. సదరు నేతలను ఉపేక్షించవద్దని, బీజేపీ సోషల్ మీడియా వేదికగా అంతే ధీటుగా తిప్పికొట్టాలని రాష్ట్ర రథసారథి రామచందర్ రావు దిశానిర్దేశం చేశారు. బీజేపీపై సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలపై కేసులు వేయాలని అందుకు తగిన విధంగా ముందుకు పోవాలని లీగల్ సెల్‌కు సూచించారట రాష్ట్ర అధ్యక్షుడు.
సోషల్ మీడియా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వెంటనే అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదనే భావనలో రాష్ట్ర రథసారథి ఉన్నారు. పార్టీ నిబంధనలు పాటించకుండా...పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెట్టిన నాయకులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు బింగి వెంకటేశ్‌పై వేటు వేశారు. అధ్యక్షుడు రాంచందర్‌రావు.. పార్టీ నేతలకు హెచ్చరికలు చేసిన వెంటనే యాక్షన్‌లోకి దిగడంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బీజేపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నట్లు పార్టీ భావిస్తోంది. ఇలాంటి సమయంలో సొంత పార్టీ నేతలే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడంపై రామచందర్ రావు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే వెంకటేశ్‌ను సస్పెండ్ అని పార్టీలో జరుగుతున్న చర్చ....
అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాల్లో యాక్టివ్ గా ఉన్నాయి. ఆ పార్టీలతో పోల్చితే.. కమలం పార్టీ సోషల్ మీడియా వెనకబడిపోయిందని పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. దీంతో పార్టీలో, అటు పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న ఈ చర్చకు చెక్ పెట్టే విధంగా రామచందర్‌రావు కార్యాచరణ చేసినట్టు తెలుస్తోంది. పార్టీ నేతలపై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలకు అదే స్థాయిలో రియాక్ట్ అవుతామనే సంకేతాలను ఆయన ఇతర పార్టీలకు పంపుతున్నారు. కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా...యాక్షన్ ద్వారా చూపించాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీలోని కొందరూ నేతలు చెబుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతను సస్పెండ్ చేసి ఇతర నేతలకు, కార్యకర్తలకు ఆయన గట్టి హెచ్చరికలు చేశారని అంటున్నారు....
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సైతం రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ నేతలను గాడిలో పెట్టే విధంగా దూకుడుగా ముందుకు పోతున్నారని పార్టీ నేతలు అంటున్న మాట. పార్టీ బలంగా ఎదుగుతున్న సమయంలో ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియాలు బీజేపీని నైతికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని...వాటిని తిప్పి కొట్టే విధంగా బీజేపీ సోషల్ మీడియాతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధమై....పార్టీ నేతలపై చేస్తున్న తప్పుడు విమర్శలకు దీటుగా సమాదానం చెప్పాలని పార్టీ అధ్యక్షుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టకపోతే....రాష్ట్రంలో భవిష్యత్ ఉండదని నాయకులకు రామచందర్ రావు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం మంత్రులను కలిసిన పార్టీని బ్లేమ్ చేస్తున్నారని అంటున్నారు. ఇలా చేసే వారికి బలంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు. బీజేపీపై...పార్టీ నేతలపై తప్పుడు వార్తలు రాస్తే...పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనకడుగు వేయమని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయాలంటే ఇలాంటి నేతలను ఏరిపారేయాలని అప్పుడు ఎన్నికలో విజయం సాధ్యమవుతుందని రామచందర్ రావు భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్న మాట. చూడాలి మరి అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత మేరకు సక్సెస్ అవుతాయో.. నేతల రియాక్షన్ ఏంటో..