ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అయ్యాయి. సమావేశాల్లో కృష్ణానదీ జలాలపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అయ్యాయి. సమావేశాల్లో కృష్ణానదీ జలాలపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు శాసనసభ, శాసన మండలిలో జరగవలసిన ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. శాసనసభలో దివంగత ఎమ్మెల్యేలు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డి ల సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. శాసనమండలిలో మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్ ల సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు.
శాసనసభ, శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, సీతక్క వివిధ అంశాలను ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలు వాయిదా పడ్డ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. శాసనసభ, మండలి ఎన్ని రోజులు నిర్వహించాలని బీఏసీ నిర్ణయిస్తుంది. కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని బిఆర్ఎస్ పట్టుబడుతోంది.
మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్ చేరుకున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశంలో కృష్ణ గోదావరి నదీ జలాలు, ప్రాజెక్టుల పై ప్రధాన చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల తగ్గింపు పై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. కృష్ణ, గోదావరి ప్రాజెక్టులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. తమకు పిపిటి అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్ కోరుతోంది.
శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతంది. ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిన కొన్ని బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెడుతుంది. సభను హుందాగా నడుపుకుందామని అన్ని పక్షాలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బిజెపి నిర్ణయించుకుంది.