SLBC Tunnel: కదిలిస్తే కన్నీరే..బావ రాకపోతే అక్కాపిల్లలకు తోడెవరు?

Update: 2025-02-26 03:30 GMT

SLBC Tunnel: ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా భయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోపక్క టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు దోమలపెంట శిబిరానికి చేరుకుంటున్నారు. ఝార్ఖండ్ లోని కాంబియా కుంబటోలి అనే గ్రామానికి చెందిన సంతోష్ సాహు, సందీప్ సాహు, జగ్టాఎక్కేస్ అనూజ్ సాహు టన్నెల్ లో చిక్కుకోగా..వారికి కుటుంబ సభ్యులను ఝార్ఖండ్ ప్రభుత్వం దోమలపెంటకు తీసుకువచ్చింది. నిరుపేద కుటుంబాలకు చెందిన వీరంతా తమ బాధను దిగమింగుకుని ఒకరికొకరు ధైర్యం చెప్పకుంటూ తమ వారికోసం ఎదురుచూస్తున్నారు.

భార్యా బిడ్డలను పోషించుకునేందుకు మా బావ సంతోష్ సాహు ఇక్కడికి వచ్చాడు. సొరంగం పనులు చేసి కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఆయన ఏమైనా జరిగితే మా అక్క..ఆమె ముగ్గురు పిల్లలకు తోడునీడ లేకుండా పోతుందని బాధితుడు సంతోష్ సాహు బావమరిది పవన్ సాహు విలపించాడు.

సందీప్ సాహు నా పెద్ద కుమారుడు మూడు నెలల జీతం ఇవ్వగానే ఇంటికి వస్తానని వారం క్రితమే మాతో ఫోన్ లో చెప్పాడు. ఇంటి దగ్గరే ఉండే ఏదైనా పని చేసుకోమని చెబితే..కొంత డబ్బు సంపాదిస్తే మన కుటుంబం బాగుపడుతుందని చెప్పి మూడు నెలల క్రితం ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఇలా జరిగిందంటూ ఆయన తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు.

వచ్చిన పని చేసుకుంటూ సొంత ఊరిలో ఉండాలని మా తమ్ముడికి ఎన్నో సార్లు చెప్పాము. కానీ సొంతంగా డబ్బు సంపాదించి తండ్రిలేని ఇంటిని, తల్లిని పోషించుకుంటానని చెబుతుండేవాడు. మా పక్క ఊరి వాళ్లు చాలా మంది ఇక్కడ పనిచేస్తున్నారు. 2017లో ఇక్కడికి వచ్చిన జగ్టా ఎక్కేస్ 8ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం చివరిసారిగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఏదైనా వ్యాపారం పెట్టిస్తా అని చెప్పినా వినలేదు. చివరకు సొరంగంలో చిక్కుకున్నాడని తెలిసి మా కుటుంబం ఆందోళనలో ఉందని బాధితుడు అన్న వాపోతున్నాడు.

Tags:    

Similar News