వేడెక్కుతున్న ఆర్టీసీ యూనియన్ రాజకీయాలు

Update: 2021-02-08 04:52 GMT

Representational Image

తెలంగాణ మజ్దూర్ యూనియన్ అసలు నాయకుడు ఎవరు? అశ్వథామ రెడ్డియా లేదా థామస్ రెడ్డియా? గత ఆర్టీసీ సమ్మెలో కీలకపాత్ర పోషించిన అశ్వథామ రెడ్డిని సర్కార్ పట్టించుకోవడంలేదు. టీఎంయూ బహిష్కృత నాయకుడు అశ్వథామ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తోంది. రెండు వర్గాలుగా చీలిన యూనియన్ నాయకులు సభలు, సమావేశాలతో ఎవరికి వారు ఆధిపత్యం చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ చేసినా పని యూనియన్ నేతల మధ్య మరింత రగడకు కారణమైంది. ఇంతకీ పువ్వాడ అజయ్ ఏం చేశారు?

ఆర్టీసీ ఉద్యోగ భద్రత పాలసీని ఖైర‌తాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్ భ‌వ‌న్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ విడుదల చేశారు. టీంఎమ్ యూ బహిష్కృత నేత థామస్ రెడ్డిని మంత్రి పక్కన కూర్చొబెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది.

టీఎంయూ బహిష్కృత నేత థామస్ రెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వథామ రెడ్డి మధ్య అధిపత్య పోరు నడుస్తోంది. ఎవరికి వారే కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. థామస్ రెడ్డిని యూనియన్ నుండి సస్పెండ్ చేశామని, అతనికి యూనియన్ తో సంబంధంలేదని అశ్వథామ రెడ్డి చెబుతుండగా, యూనియన్ పేరు వాడుకుని అశ్వథామ రెడ్డి కోట్ల రూపాయలు కూడబెట్టారని థామస్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇద్దరు నేతల పరస్పర విమర్శలతో యూనియన్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

థామస్ రెడ్డి, అశ్వథామ రెడ్డి మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఆర్టీసి ఉద్యోగుల భద్రత పాలసీ విడుదల చేసే సమయంలో థామస్ రెడ్డిని మంత్రి పువ్వాడ పక్కన కూర్చోబెట్టుకున్నారు. పువ్వాడకు థామస్ రెడ్డి శాలువా కప్పి సన్మానం చేశారు. టీఎంయూ బహిష్కృతనేతకు మంత్రి ప్రాధాన్యత ఇవ్వడాన్ని అశ్వథామరెడ్డి వర్గం జీర్ణం చేసుకోలేకపోతుంది. ఆర్టీసీ కార్మికుల జాతీయ కార్యవర్గంలో మంత్రి పువ్వాడ చర్యను అశ్వథామ రెడ్డి తప్పు బట్టారు.

టీఎంయూ అసలు నాయకుడు అశ్వథామ రెడ్డియా లేదా థామస్ రెడ్డియా అనే కన్ఫ్యూజన్ లో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. ఎవరి వైపు ఉండాలి అన్న దానిపై ఆర్టీసీ ఉద్యోగుల్లో చర్చకు దారితీసింది. థామస్ రెడ్డికి మంత్రి పువ్వాడ ప్రాధాన్యత ఇవ్వడంతో అతడికి ప్రభుత్వం మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. థామస్ రెడ్డికి మ్మెల్సీ కవిత మద్దతు కూడా ఉందనే ప్రచారం నడుస్తుంది. రానున్న రోజుల్లో ఆర్టీసీ యూనియన్ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయే వేచి చూడాలి. 

Tags:    

Similar News