RTC Strike: తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్‌డౌన్..7 నుంచి సమ్మె సైరన్
TGSRTC Strike: మార్చి 7 నుంచి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. డిమాండ్ల పరిష్కారంలో సర్కార్ జాప్యాన్ని నిరసిస్తూ..టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సిద్ధం అయ్యింది. నేడు అర్థరాత్రి వరకు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించనట్లయితే రేపు ఉదయం నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సమ్మె పిలుపులో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలో గల ఆర్టీసీ కళాభవన్ నుంచి ఆర్టీసీ బస్ భవన్ వరకు కార్మిక కవాతు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కార్మికులు యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత బస్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నేతలు ప్రసంగించారు.
గత 10ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు మరింత పెరిగాయంటూ వారు విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణలు చేపట్టడం, కార్మిక సంఘాలను పునరుద్ధరించడం కొత్త బస్సులను కొనుగోలు చేయడం వంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 16 గంటలపాటు పనిచేయడం వల్ల సిబ్బందికి అనారోగ్యానికి గురవుతున్నారని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ ఆర్టీసీ యాజమాన్యమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
సమస్యలను పరిష్కరించాలంటూ గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్నామని..జనవరి 27న సమ్మె నోటీసు కూడా ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చర్చలకు పిలవకుండా జాప్యం చేయడం సరికాదన్నారు. సమ్మెకు దిగాలనే ఉద్దేశం తమకు లేదని ప్రభుత్వం చర్చలకు పిలుస్తే సిద్ధంగా ఉన్నామంటూ స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించనట్లయితే.. జేఏసీలోని ఈయూ, టీజేఎంయూ, టీఎంయూ, ఎన్ఎంయూ, బీకేయూ, బీడబ్ల్యూయూ, కేపీ యూనియన్లకు చెందిన సుమారు 40,600 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారంటూ నేతలు హెచ్చరించారు.