Postman Cheated Customers: వరంగల్ జిల్లాలో ఘ‌రానా మోసం.. ఖాతాదారుల డబ్బులతో ఉడాయించిన పోస్టుమాన్

Postman Cheated Customers: టెక్నాలజీ లేని సమయంలోనే సమాచార వాహిణిగా విరసిల్లిన ఉత్తర ప్రత్యుత్తరాల కేంద్రం పోస్టాఫీస్. కాలక్రమేణా అది పేదల బ్యాంకుగా రూపుదిద్దుకుంది.

Update: 2020-06-26 05:55 GMT

Postman Cheated Customers: టెక్నాలజీ లేని సమయంలోనే సమాచార వాహిణిగా విరసిల్లిన ఉత్తర ప్రత్యుత్తరాల కేంద్రం పోస్టాఫీస్. కాలక్రమేణా అది పేదల బ్యాంకుగా రూపుదిద్దుకుంది. కంప్యూటర్లు లేని కాలం నుంచి ఇప్పటికీ సమాచారాన్ని చేరవేయడంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుగా సేవలందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ఇదిలా ఉంటే కంచె చేను మేసిందన్న చందంగా పేదలు దాచుకున్న డబ్బులతో ఉడాయించాడు ఓ పోస్టుమాన్. అతను చేసిన మోసానికి లబోదిబోమంటున్నారు బాధితులు.

ఓ వైపు పుట్టగొడుగుల్లా పెరుగుతోన్న సైబర్ నేరాలను పోలీసులు అరికడుతుంటే మరోవైపు ఇంకో రూపంలో మోసం చేస్తూనే ఉన్నారు కేటుగాళ్లు. కూలీ చేసుకొని పోస్టాఫీసుల్లో ఎంతో కొంత పొదుపు చెద్దామని అనుకున్న పేదల డబ్బులను అందినకాడికి దోచుకుపోయాడు ఓ పోస్టుమాన్. వరంగల్ అర్బన్ జిల్లా ఎలకతుర్తి మండలంలోని వల్బాపూర్ గ్రామంలో గత ఆరు నెలలుగా ఖాతాదారులు దాచుకున్న డబ్బులతో పోస్టుమాన్ షాబొద్దిన్ ఉడాయించాడు. దాదాపు 30 మంది ఖాతాల్లో వారి డబ్బులను జమ చేయకుండానే పాసు బుక్కుపై లెక్కలు చూపించాడు. ఖాతాదారులు అడిగితే సర్వర్ ప్రాబ్లమ్ అని తప్పించుకుతిరిగాడు. అనుమానం వచ్చి ఎంక్వైరి చేయగా పారిపోయాడు. దీంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు.

కూతురి వివాహానికి పోస్టాఫీసుల్లో డబ్బులను జమ చేసామని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుండగా పిల్లల భవిష్యత్ కోసం వివిధ కేంద్ర పథకాల ద్వారా డబ్బులను పొదుపు చేసామని మరికొందరు వాపోతున్నారు. పోస్టుమాన్ వారిని నమ్మించి డబ్బులతో పారిపోతాడనుకోలేదని పోస్టాఫీస్ ముందు గోడు వెల్లబోసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ చేస్తున్నట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సూపరిండెంట్ నిరంజన్ తెలిపారు. ఖాతాదారులు ఎవ్వరూ ఆందోళన చెందకూడదని మీ ఖాతా పుస్తకాల లెక్క ప్రకారం డబ్బులు వస్తాయని ఆయన హామీ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన పోస్టాఫీసులో కూడా ఇలా జరగడంపై వల్బాపూర్ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం వారి ఖాతాల్లోని డబ్బులను ఇప్పించాలని కోరుతున్నారు.  

Full View


Tags:    

Similar News