కోనేరు బ్రదర్స్‌ మరో కుంపటి రాజేశారా?

Update: 2019-09-05 13:07 GMT

అన్నాదమ్ముల సంబంధం, జన్మజన్మల అనుబంధం అంటూ ఆదిలాబాద్‌లో ఓ రాజకీయ నాయకుడు చాలా గట్టిగానే పాడుతున్నారు. తన తమ్ముడిపై ఈగవాలితే, పక్షిరాజులా వాలిపోయి చెడుగుడు ఆడుతానంటున్నారు. సోదరుడు ఎలాంటి వేషాలు వేసినా ఎవరూ అడగొద్దు, నిలదీయొద్దు అన్నట్టుగా, బ్రదర్‌కు బాగానే సపోర్ట్‌ చేస్తున్నారు. ఇప్పుడు కూడా తన బ్రదర్‌కు అవమానం జరిగింది, కేసులు మోపారని కసితో, ఏకంగా జడ్పీ సమావేశాన్నే బహిష్కరించారు. పార్టీ అధిష్టానంపై ఒకరకంగా ధిక్కార స్వరం వినిపంచారు. ఎక్కడివారు ఈ అన్నాదమ్ములు, వీరి సమస్యేంటి?

ఈటెల రాజేందర్ వివాదంపై ఇంకా చర్చ జరుగుతుండగానే, కుమ్రంభీమ్ జిల్లాలో టీఆర్‌ఎస్‌లో మరో బడబాగ్ని బద్దలవుతోంది. ఎమ్మెల్యే కోనప్పతో సహా ఏడుగురు జడ్పీటీసీలు, ఎంపిపిలు అత్యంత కీలకమైన జడ్పీ సమావేశాన్ని బహిష్కరించారు. జడ్పీ సమావేశాన్ని బహిష్కరించడం జిల్లాలో తీవ్ర వివాదం రేపుతోంది. బయట టీఆర్ఎస్‌‌ను పల్లెత్తు మాటా అనని కోనప్ప, గులాబీ పార్టీ పెద్దలపై పరోక్షంగా ధిక్కార వినిపించడంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

కోనప్ప ధిక్కారగళం వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ, సర్సాల గ్రామంలో అటవీ అధికారులపై దాడి చేశారు. ఈ దాడిలో అటవీ అధికారి అనిత తీవ్ర గాయాలపాలయ్యారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ కేసులో కోనప్ప తమ్ముడు క్రిష్ణ, ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవలే బెయిల్‌పై ఈ నిందితులంతా విడుదలయ్యారు. పార్టీ అధికారంలో ఉండి, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా, కేసుల విషయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో సహా ఎవరూ సహరకరించలేదని కోనప్ప అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది.

దాడి కేసులో అత్యంత కఠినమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినా, ఎవరూ పలకరించలేదని‌ కోనప్పా ఆవేదనట. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి పదవి రావడానికి తానే కారణమైనా, తనను కష్టకాలంలో పట్టించుకోలేదన్న అసంతృప్తిని అనుచరుల వద్ద వెళ్లగక్కుతున్నారట. అదే శాఖకు సంబంధించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఏమాత్రం సహకరించకపోవడం వల్ల వివాదం పెద్దదైందని కారాలు మిరియాలు నూరుతున్నారట. అదేవిధంగా పార్టీకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా మంత్రి వ్యవహరించారని కోనప్ప భావిస్తున్నారట. అందుకే జడ్పీ సమావేశాన్ని బహిష్కరించారన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి కోనప్ప తీరుపై పార్టీ ఏవిధంగా వ్యవహరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పార్టీ నాయకులు సంప్రదింపులు జరుతున్నారు. మరి పార్టీ లీడర్ల సంప్రదింపులకు కోనప్ప దిగి వస్తారో లేదో చూడాలి.

Full View

Tags:    

Similar News