పాపాలను కడతేర్చే ఆలయం

Papahareshwar emple: పాపాలను కడతేర్చే ఆలయం

Update: 2024-03-07 14:26 GMT

పాపాలను కడతేర్చే ఆలయం

Papahareshwar Temple: పాపాలను కడతేర్చి మోక్షం కల్పించే మహా పుణ్య క్షేత్రం కదిలి పాపహరేశ్వరాలయం.. ఈ ఆలయం నిర్మల్ జిల్లా కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలో కొలువై ఉంది. ఏటా శివరాత్రి మహోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఈసారి వేడుకలకు కదిలి పాపహరేశ్వరాలయం.. సర్వాంగసుందరంగా ముస్తాబవుతుంది.

4వందల ఏళ్ల చరిత్ర గల ఈ కదిలి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఆనాడు పరుశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించగా ఆ పాపవిముక్తి కోసం పరుశురాముడు కదిలిలో శివలింగాన్ని ప్రతిష్టించి పాపనిమోచనం పొందినట్లు చరిత్ర చెబుతోంది. పరశురాముడు పాపవిముక్తి పొందడంతో ఈ ప్రాంతం కదిలి పాపహరేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది.

అయితే ఈ ఆలయం ముఖ ద్వారం పడమర దిశగా ఉండటం మరో విశేషం. ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడానికి వచ్చిన సమయంలో పెద్ద శబ్దంతో ఆలయ ముఖద్వారం పడమర దిశగా మారినట్లు భక్తులు చెబుతుంటారు.

ఈ ఆలయ సమీపంలో ఋషి గుండంతో పాటు 18 రకాల చెట్లతో కూడిన వటవృక్షం ఉంది. ఆలయానికి వచ్చే భక్తులు ఈ ఋషిగుండంలో స్నానాలు ఆచరించి వటవృక్షం చుట్టు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతీ సోమవారం రోజున విశేష పూజలు జరుగుతుంటాయి. ముఖ్యంగా శ్రాపణమాసంలో ప్రతీ శని, సోమవారాల్లో స్వామివారికి అభిషేకార్చనలతో వాటు అన్నపూజలు నిర్వహిస్తుంటారు.

ఈ ఆలయ వెనుక భాగంలో అన్నపూర్ణమాత కొలువుదీరడం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత. అన్నపూర్ణమాత కొలువైనందున ఇక్కడ నిత్యాన్నదానం కొనసాగుతుంది. సంవత్సరంలో 365 రోజుల పాటు నిత్యాన్నదానం కొనసాగుతుంటుంది. అలాగే ఈ ఆలయంలో దోషనివారణ పూజలు సైతం విశేషంగా కొనసాగుతుంటాయి. తెలంగాణ ప్రాంతవాసులతో పాటు ఏపీ, మహరాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ దోష నివారణ పూజలు చేయిస్తుంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతీ ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేల సంఖ్యలో ఈ ఆలయానికి భక్తులు తరలివస్తుంటారు.

ఇటు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలతో పాటు పక్కనే ఉన్న నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతుంటారు. దీనికి అనుగుణంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శుక్ర వారం 8వ తేదీన మహాశిరాత్రి పర్వదినాన స్వామి దర్శనంతో పాటు అర్ధరాత్రి 12 గంటలకు శివపార్వతుల కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Tags:    

Similar News