Municipal Elections 2020 : ఎన్నికల ప్రచారానికి చెక్...

Update: 2020-01-20 02:38 GMT

రాష్ట్రంలోని జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో చెక్ పడనుంది. రిజర్వేషన్లు ఖరారు అయిన నాటినుంచి ఇప్పటి వరకూ అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారలు నిర్వహించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ ప్రచారం చేసారు. అంతే కాకుండా రోడ్‌ షోలు నిర్వహిస్తూ పట్టణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు.

ప్రచారంలో భాగంగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులకు మద్దతునిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. కేటీఆర్‌ సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగే ప్రచారాన్ని పర్యవేక్షిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచనలిస్తూ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పాత్ర పోషించారు.

ఇదే తరహాలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్‌ రెడ్డిలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఇక మరో పార్టీ అయిన బీజేపీ నాయకులు తమవైన శైలిలో ప్రచారాన్ని కొనసాగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అంతే కాక వారితో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇతర కీలక నేతలు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు.

ఇక ఎంఐఎం తరఫున ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా వామపక్షాలు, టీజేఎస్‌ తదితర పార్టీల నేతలు కూడా ప్రచారం నిర్వహించారు.

అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు చేసినట్టుగానే బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థులు కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రచారం కొనసాగించారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రులుగా బరిలో ఉన్న దాదాపు 3 వేల మందికిపైగా అభ్యర్థులు సైతం సత్తా చాటేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఇక అధికార టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీల నుంచి కూడా రెబల్స్‌ బరిలో ఉండటంతో వారి ప్రభావం ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులపై ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు అన్ని వర్గాల్లో నెలకొంది.

ఇంత పోటీ పోటీగా నిర్వహించిన ఎన్నికల ప్రచారాలు ఈ నెల 22న ఎన్నికలు జరగనుండడంతో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో సోమవారం సాయంత్రంతో ఆపేయనున్నారు. ఇక కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో 24వ తేదీ ఎన్నికలు ఉండడంతో బుధవారం వరకు ప్రచారానికి అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇకపోతే పోలింగ్‌కు ఒక్క రోజే గడువు ఉండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వారి ప్రయాత్నాలు వారు చేసుకుంటున్నారు.

ఇకపోతే ఎన్నికలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు, కరీంనగర్ లో బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రచారం ముగించాలని ఆదేశించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అందు భాగాంగానే రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటినీ అమలు చేసే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) కార్యదర్శి ఎన్‌.అశోక్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. 



Tags:    

Similar News