Medaram: జనప్రవేశం చేసి గద్దెనెక్కిన సమ్మక్క- సారలమ్మ.. వనదేవతల దర్శనానికి బారులు తీరిన భక్తులు
Medaram Jatara: దర్శనానికి సుమారు 6 గంటల సమయం
Medaram: జనప్రవేశం చేసి గద్దెనెక్కిన సమ్మక్క- సారలమ్మ.. వనదేవతల దర్శనానికి బారులు తీరిన భక్తులు
Medaram Jatara: మేడారం మహా జాతరలో రెండో రోజు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనం వీడి జనం మధ్యలోకి సమ్మక్క వచ్చేసింది. చిలకలగుట్టపై నుంచి కుంకుమభరిణె రూపంలో అమ్మవారిని పూజారులు గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అంతకుముందు చిలకలగుట్ట వద్ద జిల్లా ఎస్పీ శబరీష్ గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో వనదేవతకు స్వాగతం పలికారు. అమ్మవారి రాక నేపథ్యంలో ‘జై సమ్మక్క’ అంటూ మేడారం పరిసరాలు మార్మోగాయి. వనదేవతకు స్వాగతం పలుకుతూ భక్తులు దారి పొడువునా ముగ్గులు వేశారు.
కాగా.. అంతకు ముందే.. సమ్మక్క బిడ్డ సారలమ్మ, ఆమె భర్త పగిడిద్దరాజులు తండ్రి గోవిందరాజులు గద్దెలపైకి చేరుకున్నారు. మేళతాళల నడుమ కోయ సాంప్రదాయపద్దతిలో జనంలోకి అడుగుపెట్టారు. అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. గద్దెలపైకి చేరుకున్న సమయం నుంచి భక్తులు మరింత ఎక్కువగా మొక్కులు చెల్లించుకున్నారు. కనుచూపుమేరలో మేడారం జనసంద్రంగా మారిపోయి.. ఎటు చూసినా.. సమ్మక్క-సారలమ్మ నామస్మరణలతో మేడారం మార్మోగింది.
ఈరోజు, రేపు విశిష్టపూజలు అందుకున్న తర్వాత రేపు సాయంత్రం తిరిగి అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నారు. జనంలోకి ఎలాగైతే ప్రవేశించారో.. అలాగే మేళతాళాలతో సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించి... తిరిగి వన ప్రవేశం తర్వాత జాతర ఘట్టం ముగుస్తుంది.