సీఎం హోదాలో కోర్టుకు జగన్.. ఈయనే మొదటి వారు కాదు!

Update: 2020-01-10 04:20 GMT

అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు సీఎం హోదాలో తొలిసారిగా జగన్ కోర్టుకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరైన వారిలో జగన్మోహన్ రెడ్డి మొదటి వారు కాదు. గతంలో, అనేక మంది సీఎం హోదాలో కోర్టుకు హాజరైన సందర్భాలున్నాయి. తమిళనాడులో చూస్తే..జయలలిత, కరుణానిధి కూడా అనేక సార్లు కోర్టుకు సీఎం హోదాలో హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక ఎవరూ కోర్టు మెట్లు ఎక్కలేదు. తనపై కేసులు ఉన్నా.. మాజీ సీఎం చంద్రబాబు హైకోర్టు, సుప్రీంకోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నారు. కానీ, ప్రస్తుత సీఎం జగన్ మాత్రం సీబీఐ కోర్టు ఆదేశం మేరకు కోర్టులో బోను ఎక్కేందుకు రెడీ అయ్యారు.

అభ్యర్ధన మన్నించని కోర్టు!

వాస్తవానికి అక్రమాస్తుల కేసులో జగన్‌పై 11 చార్జిషీట్లను సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేశారు. ప్రతి చార్జిషీట్‌లో A-1 నిందితుడిగా జగన్‌ పేరును నమోదు చేశారు. ఇక A-2గా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఈ కేసులో సీఎం జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాలి. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పాలనపరమైన వ్యవహారాలతో బిజీగా ఉన్నందున జగన్ కోర్టుకు గైర్హాజరవుతూ వస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని గతంలో జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం హోదాలో కోర్టుకు హాజరయ్యేందుకు భద్రతా కారణాలు, బందోబస్తు ఖర్చుల నేపథ్యంలో మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు.

అయితే, జగన్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని సీబీఐ న్యాయస్థానం తేల్చిచెప్పింది. జనవరి 10 వ తేదీన కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఆయనతోపాటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. జగన్ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో ఇప్పటికే సీఎం భద్రత, బందోబస్తు విషయమై ఏపీ ప్రభుత్వం తెలంగాణ పోలీసులకు లేఖ రాయడంతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News