ఇండిగో సంక్షోభానికి అంతర్గత లోపాలే కారణం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇండిగోలో నెలకొన్న సంక్షోభం పూర్తిగా సంస్థ అంతర్గత లోపాల వల్లేనని కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ఇండిగో సంక్షోభానికి అంతర్గత లోపాలే కారణం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇండిగోలో నెలకొన్న సంక్షోభం పూర్తిగా సంస్థ అంతర్గత లోపాల వల్లేనని కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది కేటాయింపుల్లో ఏర్పడిన సమస్యలే భారీగా విమాన సర్వీసులు రద్దుకావడానికి దారితీశాయని ఆయన రాజ్యసభలో వెల్లడించారు.
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి, వీలైనన్ని ఎక్కువ ఎయిర్‌లైన్స్‌ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఎఫ్‌డీటీఎల్ (Flight Duty Time Limitations) నిబంధనలు అమలు చేసే ముందు అన్ని స్టేక్‌హోల్డర్లతో చర్చించామని, నవంబర్ 1 నుంచి రెండో దశ నిబంధనలు అమల్లోకి వచ్చాయని చెప్పారు. ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన నెలరోజుల పాటు సర్వీసులు సజావుగా నడిచాయని గుర్తుచేశారు. డిసెంబర్ 3 నుంచే ఇబ్బందులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
ఇండిగో సంక్షోభం కారణంగా ఇప్పటివరకు 5,86,700 విమాన టికెట్లు రద్దు అయ్యాయని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. టికెట్ ధరలు పెరగకుండా నియంత్రణలు అమలు చేస్తున్నామని, ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.