Weather Report: వామ్మో..గడ్డకట్టించే చలి..తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత
Weather Report: భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత భారీగా పెరిగింది. భారీగా మంచు కూడా కురుస్తోంది. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా చలి పెరిగింది. అయితే ఆదివారం ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. మేఘాలు కూడా తక్కువగా ఉంటాయని చలి తీవ్రత మాత్రం మరింత పెరుగుతుందని తెలిపింది. రెండు రాష్ట్రాల్లో పొగమంచు బాగా పెరగడంతోపాటు ఉదయం, సాయంత్రం వేళ పొగమంచు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రోజంతా ఎండ ఉండటంతోపాటు రాత్రి సమయంలో చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
గాలివేగం బంగాళాఖాతంలో గంటకు 31కిలోమీటర్లుగా ఉంది.ఏపీలో గంటకు 14కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తాయి. శ్రీలంక తూర్పు వైపు ఏర్పడబోయే అల్పపీడనం కారణంగా గాలులన్నీ అటు వైపు మళ్లుతున్నాయి. ఉష్ణోగ్రతపగటివేళ సాధారణంగానే ఉంటుంది. తెలంగాణలో 29 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. రాత్రివేళ తెలంగాణలో 19, ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది.
తెలంగాణలో తేమ శాతం 40 నుంచి 50 వరకు ఉంటుంది. ఏపీలో 40 నుంచి 70శాతం ఉంటుంది. తూర్పు రాయలసీమ, కోస్తాలో తేమ ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా ఈ ఆదివారం ప్రయాణాలు చేసేవారికి బాగుంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే రాత్రి వేళ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటుంది.