Hyderabad Metro: హైదరాబాద్‌ భవిష్యత్తును మార్చబోతున్న ఆ ప్రాజెక్ట్‌.. కసరత్తు మొదలు పెట్టిన అధికారులు..!

Hyderabad Metro: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌.. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో నగరం వస్తోంది.

Update: 2025-02-24 08:18 GMT

Hyderabad Metro: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌.. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో నగరం వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీ పేరుతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేపడుతోన్న విషయం తెలిసిందే. ప్రపంచందృష్టిని ఆకర్షించేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌ సిటీకి మెట్రో నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు రచించారు.

ఎయిర్‌పోర్ట్‌ నుంచి కేవలం 40 నిమిషాల్లోనే ఫ్యూచర్‌ సిటీకి చేరుకునేలా సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌) తయారీపై హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైలు (హెచ్‌ఏఎంఎల్‌) అధికారులు కసరత్తు చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీలతో కలిసి మెట్రోరైలు విస్తరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి మీర్‌ఖాన్‌పేటలో నిర్మాణంలో ఉన్న స్కిల్‌ యూనివర్సిటీ వరకు జరుగుతున్న సర్వే పనులను హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. ఇందుకు సంబంధించిన పలు విషయాలను ఆదివారం మీడియాతో పంచుకున్నారు.

విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌ సిటీకి సుమారు 40 కి.మీలు మెట్రో మార్గం ఉండనుంది. ఇందులో కొంత భూగర్భంలో మరికొంత ఎలివేటెడ్‌ మార్గంలో ఉంటుంది. బహదూర్‌గూడ, పెద్ద గోల్కోండంలో రెండు మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. మొత్తం మెట్రో మార్గంలో పెద్ద గోల్కొండ ఎగ్జిట్‌ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్‌ మీదుగా రావిర్యాల ఎగ్జిట్‌ వరకు 14 కి.మీలను ఎలివేటెడ్‌ మార్గంలో నిర్మించనున్నారు.

అలాగే రావిర్యాల నుంచి కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్‌ఖాన్‌ పేట వరకు దాదాపు 22 కి.మీ ఉంటుంది. ఇందులో 18 కిలోమీటర్లు భూమార్గంలో మెట్రో వెళ్తుంది. మేడ్చల్‌, శామీర్‌పేట కారిడార్లతో పాటు ఫ్యూచర్‌ సిటీకి సంబంధించి డిపీఆర్‌ను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి సమర్పించనున్నారు. 

Tags:    

Similar News