జోరువానలో జై జై గణేశ...

Update: 2019-09-02 12:33 GMT

ఖైరతాబాద్ గణేష్‌ను చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీద్వాదశాదత్య మహాగణపతి‌గా దర్శనం ఇస్తున్న ఖైరతాబాద్ గణేషుడిని వీఐపీలు సైతం దర్శించుకుని పూజలు చేస్తున్నారు. మొదట గవర్నర్‌ నర్సింహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ దంపతులను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితితో పాటు మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ శాలువాతో సన్మానించారు.

61 అడుగుల ఎత్తులో ద్వాదశాదిత్య మహా గణపతిగా రూపొందించారు. 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలతో గణనాథుడు దర్శనమిస్తున్నాడు. మహాగణపతికి కుడి వైపున పాలసముద్రంలో శయనిస్తున్న విష్ణు, ఏకాదశి దేవి కొలువు దీరారు. అలాగే ఎడమవైపు త్రిమూర్తులతో కూడిన దుర్గాదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడి విగ్రహాలను చూస్తే, సకల దేవతలు ఖైరతాబాద్ లోనే ఉన్నారా అన్న భ్రాంతి కలుగుతుంది.

ఖైరతాబాద్ వినాయకుడికి హైదరాబాద్ పోలీసులు భారీగా భద్రత నిర్వహించారు. దాదాపు 48 సీసీ కెమెరాలు, 5 డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. వినాయకుని భారీ విగ్రహాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు అలాగే భక్తులు వస్తోన్న నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే మధ్యమధ్యలో వర్షం రావడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం భారీ వర్షం రావడంతో ఎటుపోలేని పరిస్థితులో క్యూలైన్లలో ఉండిపోయారు. మరోవైపు వర్షం నీరు నిలిచిపోయి ఇబ్బందులు ఎదురయ్యాయి.  

Tags:    

Similar News