ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు.. పోరు...

అటవీశాఖ వర్సెస్‌ గిరిజనుల పోరు పోడు భూములపై హక్కులు కావాలంటున్న గిరిజనం దాడులతో బెంబేలెత్తుతున్న అధికారులు

Update: 2021-01-28 09:17 GMT

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోడు భూముల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. అటవీ భూములను రక్షించేందుకు అటవీ అధికారులు, పోడు భూములను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఇది, పోరుగా మారుతోంది. సాగును అడ్డుకుని తీరుతామని అటవీ అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈవ్యవహారoలో ప్రతీసారి రాజకీయం జోక్యం చేసుకుంటున్నందున సమస్యకు మరింత ఆజ్యం పోసినట్లవుతోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 90 వేల ఎకరాల అటవీ భూముల్లో అక్రమంగా పోడు వ్యవసాయం సాగుతోంది. 2005 డిసెంబరు 31లోపు సాగులో ఉన్న అటవీ భూములకు అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం హక్కు పత్రాలు అందించాలని అప్పట్లో కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతుల నుంచి అప్పటి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. అయితే భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో 21,195 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.

ఖమ్మం జిల్లాలో మొత్తం 14వేల హెక్టార్లలో పోడు సాగు సాగుతోంది. సరిహద్దులు నిర్ణయించకపోవడం వల్ల కొన్నిచోట్ల తమ భూమి అని అటవీశాఖ, తమ ఆధీనంలో ఉందని రెవెన్యూ అధికారులు పేచీ పెడుతున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు, మైదానప్రాంత లంబాడాలు, గిరిజనుల మధ్య విద్వేషాలు రగలడానికి పోడు భూములే కారణమన్న వాదన వినిపిస్తోంది. 

పోడు వ్యవసాయానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. నిత్యం అధికారుల బెదిరింపులతో భయం భయంగా సాగు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏళ్ల నుంచి గిరిజనులు పోడు వ్యవసాయం నమ్ముకొని తమ జీవనం సాగిస్తున్నారు. భూములపై హక్కుకల్పిస్తామని ఊకదంపుడు ప్రసంగాలు ప్రయోజనం ఎవరికి ఉండటం లేదు. ప్రతీసారి ఈవ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో సమస్య పతాకాస్థాయికి చేరుకుంటుంది.


Tags:    

Similar News