ఎన్నికల రద్దీ.. ఎల్బీనగర్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
Elections: ఎన్నికల వేళ సొంతూళ్లకు పయనమవుతున్న జనం
ఎన్నికల రద్దీ.. ఎల్బీనగర్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
Elections: హైదరాబాద్ ఎల్బీనగర్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఎన్నికల వేళ నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లేవారు వాహనాలతో రద్దీగా మారింది. ఓవైపు ఏపీతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కోదాడ వంటి ప్రాంతాలకు వెళ్లే వారు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొందరు తమ సొంత వాహనాల్లోనే గ్రామాలకు బయల్దేరారు. ఎల్బీనగర్ నుంచి పనామా వరకు రద్దీ నెలకొంది. వాహనాలు మెల్లగా కదులుతున్నాయి.
ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లలో తీవ్ర రద్దీ నెలకొంది. ఉపాధి కోసం ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వారు భారీగా తరలివెళ్తున్నారు. ఐదేళ్లకు ఓసారి వచ్చే ఓట్ల పండుగకు ఎలాగైనా వెళ్లాలనే ఉద్దేశంతో ఎన్ని ట్రాఫిక్ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రయాణీకులు ఓపికతో ముందుకు కదులుతున్నారు.