కాలనీల్లో బార్లు: మూడు వారాల్లో సమస్య పరిష్కరించాలని హైకోర్ట్ ఆదేశం
హైద్రాబాద్ యూసుఫ్ గూడ ప్రగతి నగర్ కు చెందిన కొండ చంద్రశేఖర్ నివాస ప్రాంతాల్లో బార్ ఏర్పాటుతో పడుతున్న ఇబ్బందుల గురించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
TS High Court: జనావాసాల మధ్య బార్లు, పబ్ ల ఏర్పాటు విషయమై దాఖలైన పిటిషన్ పై అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసు జారీ చేసింది. మూడు వారాల్లో ఈ సమస్యను పరిష్కరించాలని న్యాయస్థానం ఆదేశించింది. హైద్రాబాద్ యూసుఫ్ గూడ ప్రగతి నగర్ కు చెందిన కొండ చంద్రశేఖర్ నివాస ప్రాంతాల్లో బార్ ఏర్పాటుతో పడుతున్న ఇబ్బందుల గురించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యాసంస్థలు, నివాస గృహాల సమీపంలో బార్లు, పబ్ ల ఏర్పాటు విషయమై ఉన్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాలు సక్రమంగా అమలు కావడం లేదని మహిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడమే కారణమని మహిళ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు.
బార్లు, పబ్ లలో అర్ధరాత్రిపూట పెద్ద పెద్ద మ్యూజిక్ తో స్థానికులకు ఇబ్బంది కలిగించవద్దని 2022 డిసెంబర్ లో హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ నగరంలోని చాలా ప్రాంతాల్లో బార్లు, పబ్ ల ఏర్పాటు విషయంలో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
నగరంలోని వనస్థలిపురం సామనగర్ లో విద్యా సంస్థకు సమీపంలోనే బార్ ఏర్పాటు విషయమై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నెలరోజుల్లోనే యూసుఫ్ గూడ ప్రగతినగర్ కు చెందిన చంద్రశేఖర్ కోర్టును ఆశ్రయించారు.
జనావాసాల్లో బార్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎక్సైజ్, జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా చంద్రశేఖర్ ఆ పిటిషన్ లో గుర్తు చేశారు. బార్ ఏర్పాటు చేసిన భవనం తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం(2020) నిబంధనలకు విరుద్దంగా ఉందని పిటిషనర్ ఆరోపించారు.ఈ విషయమై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోని విషయాన్ని ఆయన ఆ పిటిషన్ లో ప్రస్తావించారు.
పిటిషనర్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని జీహెచ్ఎంసీ, ఎక్సైజ్ శాఖకు చెందిన న్యాయవాది హైకోర్టుకు దృష్టికి తెచ్చారు.ఈ పిటిషన్ పై విచారణను జూన్ 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.