Telangana Six Guarantees: 6 గ్యారెంటీలపై గుడ్ న్యూస్.. మహిళలకు నెలకు రూ.2500, రాజీవ్ యువ వికాసం, రూ.4000 పింఛన్‌పై కీలక ప్రకటన..!!

Telangana Six Guarantees: 6 గ్యారెంటీలపై గుడ్ న్యూస్.. మహిళలకు నెలకు రూ.2500, రాజీవ్ యువ వికాసం, రూ.4000 పింఛన్‌పై కీలక ప్రకటన..!!

Update: 2026-01-16 05:28 GMT

Telangana Six Guarantees: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం ఉత్సాహంగా కొనసాగుతోంది. రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా ఈ పండుగ సందర్భంగా కొంత విరామం తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి సంబురాలు జరుపుకుంటూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలందరూ మరింత సుఖసంతోషాలతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి ఫలాలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం పూర్తిగా ప్రజల సంక్షేమానికే అంకితమై పనిచేస్తోందని స్పష్టం చేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రజలకు శుభవార్త కూడా వినిపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనుకాడడం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, ఇప్పటికే వాటిలో నాలుగు హామీలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. మిగిలిన రెండు గ్యారెంటీలను కూడా అతి త్వరలోనే అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను తప్పకుండా నిలబెట్టుకునేలా తనపై శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో నాలుగు ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్నాయని, మిగిలిన రెండు హామీలైన రాజీవ్ యువ వికాసం పథకం మరియు పింఛన్ మొత్తాన్ని రూ. 4 వేల వరకు పెంచే హామీ కూడా త్వరలోనే అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసమర్థ పాలన కారణంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిందని తెలిపారు. అంతేకాకుండా, ప్రతి నెలా రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం పూర్తిగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరోసారి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీల వివరాలను కూడా ఆయన వివరించారు.

మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ పథకం ఇంకా పూర్తిగా అమలులోకి రావాల్సి ఉన్నప్పటికీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్ సదుపాయం ఇప్పటికే అమలవుతున్నాయని తెలిపారు.

రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి రూ. 12,000 ఆర్థిక సహాయం అందిస్తుండగా, వరి పంటకు రూ. 500 బోనస్ కూడా ఇస్తున్నామని చెప్పారు.

గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం, అవసరమైన చోట ఇంటి స్థలం కూడా కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

యువ వికాసం పథకం ద్వారా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు రూ. 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చామని, ఇది త్వరలోనే అమలులోకి రానుందని మంత్రి తెలిపారు.

అలాగే చేయూత పథకం కింద పింఛన్ మొత్తాన్ని రూ. 4,000కు పెంచుతామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News