Intermediate Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..పరీక్షకు 1,2 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
Intermediate Exams: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. దీంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. తొలిసారిగా హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దీని సాయంతో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో సులభంగా తెలుసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ క్రిష్ణఆదిత్య తెలిపారు. 29,992 మంది ఇన్విజిలేటర్లు, 72 ఫ్లయింగ్ స్క్వాడ్, 124 సిట్టింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రశ్నా పత్రాలు , ఆన్సర్ షీట్లు జిల్లా కేంద్రాలకు చేరాయని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం చేసుకుంటూ పరీక్షల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యార్థులకు హాల్ టికెట్లను ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు 8.45 వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కోరారు... 1లేదా 2 నిమిషాలు ఆలస్యమైన వారిని కూడా అనుమతిస్తామని తెలిపారు.
మార్చి 5 నుంచి ప్రారంభం కానున్న జూనియర్ ఇంటర్ పరీక్షలు ఈనెల 24వ తేదీన ముగుస్తాయి. సీనియర్ ఇంటర్ పరీక్షలు మార్చి 6 నుంచి మొదలై ఈనెల 25 వరకు జరుగనున్నాయి.