Hyderabad: ఓవైసీల అడ్డానా? ఈ పార్లమెంట్ నియోజకవర్గం చరిత్ర ఏంటి?

Hyderabad: హైద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 1984 నుండి అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యులే విజయం సాధిస్తున్నారు.

Update: 2024-05-15 05:17 GMT

Hyderabad: ఓవైసీల అడ్డానా? ఈ పార్లమెంట్ నియోజకవర్గం చరిత్ర ఏంటి?

Hyderabad: హైద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 1984 నుండి అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యులే విజయం సాధిస్తున్నారు. వరుస విజయాలు సాధిస్తున్న ఎంఐఎం అభ్యర్ధి అసదుద్దీన్ ఓవైసీపై మాధవీలతను బీజేపీ బరిలో దింపింది. హైద్రాబాద్‌లో గెలుపు కోసం రెండు పార్టీలు చేసిన ప్రచారం ఈసారి యుద్ద వాతావరణాన్ని తలపించింది. ఇరు పార్టీల ప్రచారం చూసిన ఓటర్లు ఎటు వైపు మొగ్గారు? వారి తీర్పు ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. హైద్రాబాద్ పై తమ పట్టు కొనసాగుతుందని మజ్లిస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. పాతబస్తీపై పట్టు బిగిస్తామని కమలం పార్టీ కూడా నమ్మకం వ్యక్తం చేస్తోంది.

ఒకప్పుడు కాంగ్రెస్ కోట, నేడు మజ్లిస్ అడ్డా

హైద్రాబాద్ పార్లమెంట్ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. సాధారణ ఎన్నికలు ప్రారంభమైన నాటి నుండి 1980 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులే ఈ స్థానం నుండి విజయం సాధించారు. కానీ, ఆ తర్వాత ఏ ఎన్నికల్లో కూడ కాంగ్రెస్ అభ్యర్ధులు ఈ స్థానంలో విజయం సాధించలేదు. ఆ తర్వాత ఆలిండియా మజ్లిస్ ఎ ఇత్తెహదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అభ్యర్థులే గెలుస్తున్నారు.1952,1957,1962,1967 , 1977 లలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్ధులు, 1980లో కాంగ్రెస్(ఐ) అభ్యర్ధి విజయం సాధించారు.

1952లో అహ్మద్ మొహినుద్దీన్, 1957లో వినాయక్ రావు కోరాట్కకర్ లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా విజయం సాధించారు. 1962,1967లలో గోప్లై సుబ్బుకష్ణ మెల్కోటే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. 1971లో మెల్కోటే తెలంగాణ ప్రజా సమితి తరపున మరోసారి పార్లమెంట్ మెట్లెక్కారు.1977లో కె.ఎస్. నారాయణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఇక్కడి నుండి ఎంపీగా గెలిచారు. 1980లో కె.ఎస్. నారాయణ కాంగ్రెస్ (ఐ) అభ్యర్ధిగా మరోసారి విజయం సాధించారు. ఇక 1984 నుండి హైద్రాబాద్ ఓటర్లు మజ్లిస్ మినహా ఇతర పార్టీలకు పట్టం కట్టలేదు.

హైద్రాబాద్ పై పట్టు బిగించిన మజ్లిస్

1984 నుండి 2019 ఎన్నికల వరకు హైద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యులే విజయం సాధిస్తున్నారు. 1984లో అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఇండిపెండెంట్ గా తొలిసారిగా హైద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి గెలుపొందారు. ఆ తరువాత ఎంఐఎం అభ్యర్థిగా 1989,1991,1996,1998,1999 ఎన్నికల్లో వరసగా అయిదుసార్లు సలావుద్దీన్ ఓవైసీ గెలిచారు. 2004 నుండి ఈ స్థానాన్ని అసదుద్దీన్ ఒవైసీ తండ్రి నుంచి వారసత్వంగా అందుకున్నారు. అసదుద్దీన్ 2004,2009,2014,2019 ఎన్నికల్లో ఇక్కడ తిరుగులేని విజేతగా నిలిచారు. ఇప్పుడు మరోసారి విజయం తనదేననే ధీమాతో ఉన్నారు.

హైద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో మజ్లిస్ పార్టీకి పట్టు సాధించడంలో సలావుద్దీన్ ఓవైసీ కృషి చేశారు. 1960లో హైద్రాబాద్ మున్సిఫల్ కార్పోరేషన్ లో మల్లేపల్లి వార్డు కార్పోరేటర్ గా సలావుద్దీన్ తొలుత విజయం సాధించారు. 1962లో ఇండిపెండెంట్ గా ఇదే స్థానం నుండి ఆయన గెలుపొందారు. 1967లో చార్మినార్ నుండి, 1972లో యాకుత్ పురా నుండి, 1978లో చార్మినార్ నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. కార్పోరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలపై ఆయన చట్టసభల్లో గొంతెత్తారు.పాతబస్తీలో పార్టీ విస్తరణకు కృషి చేశారు. 1984లో హైద్రాబాద్ ఎంపీ స్థానం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. 1989 నుండి 1999 వరకు ఎంఐఎం అభ్యర్ధిగా ఇదే స్థానం నుండి సలావుద్దీన్ గెలుపొందారు. 2004 నుండి అసదుద్దీన్ ఓవైసీ ఈ స్థానంలో గెలుస్తున్నారు.

అందరి చూపూ ఆ మూడు అసెంబ్లీ స్థానాల మీదే...

1952లో హైద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముషీరాబాద్, సోమాజీగూడ, చాదర్ ఘాట్, బేగంబజార్, షాలిబండ్, కార్వాన్, హైద్రాబాద్ సిటీ అనే అసెంబ్లీ నియోజకవర్గాలుండేవి.1957 నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

సుల్తాన్ బజార్, బేగంబజార్, ఆసిఫ్ నగర్, హైకోర్టు, మలక్ పేట, యాకత్ పుర, పత్తర్ గట్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలోకి వచ్చాయి.1962లో కూడ ఇవే నియోజకవర్గాలున్నాయి. కానీ, 1967లో నియోజకవర్గాల పునర్విభజనతో హైద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గాలు మారాయి.

తాండూరు, వికారాబాద్, చేవేళ్ల, సీతారాంబాగ్, మలక్ పేట, యాకత్ పుర,చార్మినార్ నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలోకి వచ్చాయి.1977లో మరోసారి నియోజకవర్గాలు మారాయి. తాండూరు, వికారాబాద్, చేవేళ్ల, కార్వాన్, మలక్ పేట, యాకత్ పుర, చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గాలు చేరాయి.

అంతకుముందున్న సీతారాంబాగ్ స్థానంలో కార్వాన్ నియోజకవర్గం చేరింది. 2009 నుండి మలక్ పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్ పుర, బహదూర్ పుర అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.1967 నుండి 2009 వరకు రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, తాండూర్, చేవేళ్ల అసెంబ్లీ నియోజకవర్గాలు హైద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండేవి. దీంతో మజ్లిసేతర పార్టీలు ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టేవి.ఈ మూడు నియోజకవర్గాలు మినహాయించి ఇతర నియోజకవర్గాలపై మజ్లిస్ పార్టీ కేంద్రీకరించేది.

1984, 1989,2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు ఈ స్థానంలో రెండో స్థానంలో నిలిచారు. 1984లో టీడీపీ అభ్యర్ధి కె. ప్రభాకర్ రెడ్డి,1989 లో తీగల కృష్ణారెడ్డి, 2019లో టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన జాహెద్ అలీఖాన్ రెండో స్థానంలో నిలిచారు. 1991 ఎన్నికల్లో సలావుద్దీన్ ఓవైసీపై బీజేపీ అభ్యర్ధి బద్దం బాల్ రెడ్డి 39,524 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.ఆ తర్వాత ఏ పార్టీ అభ్యర్ధి ఇంత తక్కువ మెజారిటీతో ఓటమి పాలుకాలేదు.

పాతబస్తీలో పాగాకు బీజేపీ ప్లాన్

హైద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాగా వేయాలని చాలా కాలం నుండి బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. కానీ, ఆ పార్టీ వ్యూహాలు మాత్రం ఇప్పటివరకు పని చేయలేదు. వెంకయ్యనాయుడు ఈ పార్లమెంట్ స్థానం నుండి బరిలో దిగినా కూడ ఆ పార్టీ విజయం సాధించలేదు. 1996లో బీజేపీ అభ్యర్ధిగా వెంకయ్యనాయుడు ఈ స్థానంలో పోటీ చేసి 73,772 ఓట్ల తేడాతోఓటమి పాలయ్యాడు.

1991లో హైద్రాబాద్ స్థానంలో బీజేపీ అభ్యర్ధి బద్దం బాల్ రెడ్డి 39వేల ఓట్లతో ఓటమి పాలయ్యాడు. 1999లో మరోసారి బద్దం బాల్ రెడ్డిని బీజేపీ మరోసారి బరిలోకి దింపింది. అయితే ఈ దఫా బాల్ రెడ్డికి విజయం దక్కలేదు.2004లో బీజేపీ అభ్యర్ధిని మార్చింది. ఈ స్థానం నుండి సుభాష్ చందర్ జీ ని రంగంలోకి దింపింది. అయినా ఫలితం దక్కలేదు. 2009లో సతీష్ అగర్వాల్ ను ను బరిలోకి దింపింది. కానీ, బీజేపీకి విజయం దక్కలేదు. 2014, 2019లలో ఇదే స్థానం నుండి భగవంతరావు పోటీ చేశారు. కానీ, ఎంఐఎం అభ్యర్థులే గెలుపొందారు.ఈసారి మాధవీలతను బీజేపీ రంగంలోకి దింపింది. ప్రచారం నుండి పోలింగ్ వరకు బీజేపీ అభ్యర్ధి మాధవీలత దూకుడుగా వ్యవహరించారు. దరిమిలా ఆమె మీడియాలో పతాకశీర్షికల్లో నిలిచారు. ఎంఐఎంపై ఢీ అంటే ఢీ అంటూ సాగారు.ప్రత్యర్ధి పార్టీకి కౌంటర్ వ్యూహాంతో ముందుకు సాగారు.

పోలింగ్ రోజున ముస్లిం మహిళ ఓటర్ల బురఖాలను తీసి గుర్తింపు కార్డులను పరిశీలించారు. ఈ విషయమై హైద్రాబాద్ రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు మాధవీలతపై మలక్ పేట పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటర్లను ఆకట్టుకొనేందుకు రెండు పార్టీలు తమ అస్త్రశస్త్రాలను ప్రయోగించారు. అయితే ఓటర్లు ఎవరిని కరుణిస్తారో జూన్ 4న తేలనుంది.

Tags:    

Similar News