Cyber Fraud in Hyderabad: అమెరికన్ స్టాక్ మార్కెట్ పేరుతో ₹1.04 కోట్లు స్వాహా!
అమెరికా స్టాక్ మార్కెట్ పేరుతో కొండాపూర్‌కు చెందిన ఒక వ్యాపారిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. వాట్సాప్ గ్రూపులు, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌ల ద్వారా నమ్మించి ఏకంగా రూ. 1.04 కోట్లు కాజేశారు. భారీ లాభాల ఆశ చూపి చేసే ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
భారీ లాభాల ఆశ చూపి అమాయకులను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఈసారి హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ హబ్ అయిన కొండాపూర్‌లో పంజా విసిరారు. అమెరికా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఒక వ్యాపారిని నమ్మించి, ఏకంగా రూ. 1.04 కోట్లు కాజేశారు.
వలేశారు ఇలా..
ఈ మోసం అంతా ఒక సినిమా స్క్రిప్ట్‌లా సాగింది. నిందితుడు తనను తాను అమెరికాకు చెందిన స్టాక్ బ్రోకర్‌గా పరిచయం చేసుకున్నాడు. బాధితుడిని ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి, అందులో న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (NYSE) కి సంబంధించిన నకిలీ వార్తలు, ఫోటోలను పోస్ట్ చేయడం ప్రారంభించాడు. గ్రూప్‌లోని ఇతర సభ్యులు (నేరగాళ్ల అనుచరులు) తమకు భారీ లాభాలు వచ్చాయంటూ నకిలీ స్క్రీన్‌షాట్లు పెట్టి బాధితుడిని నమ్మించారు.
నమ్మకం కలిగించి.. నట్టేట ముంచారు
పెట్టుబడి కోసం నిందితులు 'క్యాప్టో స్టోర్ ఇన్' (Capto Store In) అనే నకిలీ యాప్‌ను ఇన్స్టాల్ చేయించారు.
మొదట బాధితుడు కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టగా, నమ్మకం కలిగించడం కోసం రూ. 1.01 లక్షల లాభాన్ని అతని ఖాతాకు తిరిగి పంపారు.
ఇది నిజమైన సంస్థే అని నమ్మిన వ్యాపారి, విడతల వారీగా మొత్తం రూ. 1.04 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు.
యాప్‌లో అతని ఖాతాలో కోట్లలో లాభం కనిపిస్తున్నట్లు చూపించారు కానీ, వాటిని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇవ్వలేదు.
అసలు రంగు బయటపడింది ఇలా..
బాధితుడు తన లాభాలను డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా, కేటుగాళ్లు కొత్త డ్రామా ఆడారు. ఆ డబ్బు రావాలంటే అదనంగా రూ. 49.39 లక్షలు పన్నుల పేరుతో చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు తాను మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల హెచ్చరిక: వీటిని అస్సలు నమ్మకండి!
ఈ కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నేరగాళ్లు వాడిన బ్యాంక్ ఖాతాలను, ఐపీ అడ్రస్‌లను ట్రాక్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు:
అనధికార యాప్స్: ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో లేని లింకుల ద్వారా వచ్చే యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయవద్దు.
వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూపులు: స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తామంటూ వచ్చే గ్రూపుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
భారీ లాభాలు: తక్కువ కాలంలో రెట్టింపు లాభాలు ఇస్తామంటే అది 100% మోసమే అని గుర్తించాలి.
అలర్ట్: మీరు కూడా ఇలాంటి మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.