సెకండ్ సేల్స్ నయా మోసాలు

Update: 2019-07-24 08:52 GMT

తాము ఆర్మీ ఉద్యోగులం బదిలీపై వేరే ప్రాంతాలకు వెళ్తున్నామంటారు.. సెకండ్ హ్యాండ్‌లో ఆన్‌లైన్ ద్వారా ఖరీదైన వాహనాలు అమ్ముతామంటూ ప్రకటనలు చేస్తారు. మీకు కావాల్సిన వాహనం అతి తక్కువ ధరకే మీకు అమ్ముతామని నమ్మిస్తారు. ఇంకేముంది ఆర్మీ అనే సెంటిమెంట్‌తో లక్షల రూపాయలు కొల్లగొడుతోంది ఓ ముఠా. ఇప్పుడీ ముఠా చేతిలో మోసపోయిన బాధితులు రోజుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు.

మోసపోయే వాడు ఉన్నంతకాలం మోసం చేసే వారు ఉంటారన్నది నిజం అవుతోంది. టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతున్న సమయంలో టెక్నాలజీని ఆసరాగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు జనాన్ని ఏదో ఒక విధంగా మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా బ్యాంకు OTPలు ద్వారా మోసాలు, ఆన్‌లైన్ చీటింగ్, సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడ్డారు. తాజాగా ఆర్మీ ఉద్యోగుల పేరుతో ఆన్‌లైన్ మోసాలకు తెరలేపారు కేటుగాళ్లు.

తాము హైదరాబాద్‌లో ఆర్మీలో పనిచేస్తున్నామంటూ ముందుగా OLXలో ప్రొఫైల్ పెడతారు. ఆ తర్వాత తమకు వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్తున్నామని, తమ ఖరీదైన వస్తువులను అంత దూరం తీసుకెళ్లలేకపోతున్నాం. ఎవరైనా తమ వాహనాలు కొనొచ్చని అంటారు. అంతేకాదు 50శాతానికే వాహనాలు అమ్మకం చేస్తామంటూ ఆకర్షణీయంగా ప్రకటనలు చేస్తారు. దీంతో వారి ప్రొఫైల్‌లో ఉన్న ఫేక్ ఐడీ కార్డులు చూసి చాలా మంది వారికి కాల్స్ చేస్తుంటారు. అంతే కాల్ చేసిన వారిని నమ్మించి మరీ దోచేస్తున్నారు దుండగులు. గూగుల్ పే ద్వారా కస్టమర్ల నుంచి డబ్బులు దండుకుని తీరా వాహనం ఇచ్చే సమయంలో వారి మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తూ భారీ మోసాలకు తెరలేపారు నేరగాళ్లు.

OLX, QUIKRలో తక్కువ ధర కలిగిన వస్తువులు మొదలుకొని కొన్ని లక్షల రూపాయల విలువ చేసే కార్లు, స్థలాలు, ఇళ్లు, ఇలా రకరకాల వస్తువులను సెకండ్ హ్యాండ్‌లో ఆయా వెబ్‌సైట్లలో విక్రయిస్తారు. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్ముతున్నామని చెప్పి వినియోగదారులను నమ్మిస్తారు. తక్కువ ధరకు వస్తువు వస్తుందనిపిస్తే చాలు నిజనిజాలు చూసుకోకుండా.. కనీస ఆలోచన కూడా చేయకుండా వారు అడిగిన డబ్బును బదిలీ చేసేస్తున్నారు. తాజాగా మిలటరీ, ఆర్మీ ఉద్యోగులమంటూ సైబర్ నేరగాళ్లు అమాయకులకు గాలం వేస్తున్నారు. ప్రజలను మోసం చేసేందుకు దేశవ్యాప్తంగా విధులు నిర్వర్తించే ఆర్మీ ఉద్యోగుల పేర్లను కూడా వాడుకుంటున్నారు మాయగాళ్లు.

మరికొన్ని సందర్భాల్లో తాము ఆర్మీ ఉద్యోగులమని, హైదరాబాద్‌లో పనిచేయడానికి వస్తున్నామని, మీ ప్రకటన చూశామని ఫోన్లు చేస్తూ వారి వాహనాల పత్రాలు తీసుకుని తిరిగి వాటినే వేరే పేరుతో OLXలో మరో పోస్టు పెడుతున్నారు. సైబర్ మాయగాళ్లు ఇలాంటి ప్రకటనలు చేసి మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

Full View  

Tags:    

Similar News