Coronavirus: ఓయూ లేడీస్‌ హాస్టల్‌లో కరోనా కలకలం

Coronavirus: 150 మందికి టెస్టులు.. ఆరుగురికి పాజిటివ్‌ ‎* కరోనా టెస్టులు నిలిపివేసిన అధికారులు

Update: 2021-03-20 05:49 GMT

ఉస్మానియా యూనివర్సిటీ (ఫైల్ ఫోటో)

Coronavirus: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా మార్చి నెల నుంచి కొవిడ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే విద్యాసంస్థల్లో కరోనా కేసులు నమోదు కావడం తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు స్కూళ్లల్లో కేసులు రికార్డు కాగా తాజాగా హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది.

హైదరాబాద్‌ నగర ప్రజలను కరోనా వైరస్‌ మరోసారి భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ ఉమెన్స్‌ హాస్టల్‌లో కరోనా కలకలం రేగింది. గురువారం నాడు లేడీస్‌ హాస్టల్‌లో కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే 150 మందికి టెస్టులు చేయగా వారిలో ఆరుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బాధితులను కింగ్‌ కోఠిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

ఓయూ లేడీస్‌ హాస్టల్‌లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో మిగిలినవారికి పరీక్షలు నిలిపివేశారు అధికారులు. దీంతో విద్యార్థినులు మండిపడుతున్నారు. కరోనా సోకిన అమ్మాయిలతో కలిసి భోజనం చేశామని, హాస్టల్లో తిరగటం, కాలేజీకి వెళ్లడం, కలిసి చదువుకోవడం లాంటివి జరిగాయని ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కరోనా పరీక్షలు నిలిపివేయడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అందరికీ కరోనా పరీక్షలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు విద్యార్థినులు.

మరోవైపు ఇవాళ్టి నుంచి ఓయూలో మూడో సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో టెస్టులు చేయించుకోకుండా కాలేజీకి వెళ్లి ఎగ్జామ్స్‌ ఎలా రాస్తామని అంటున్నారు స్టూడెంట్స్. తమ ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, అందరికీ కరోనా టెస్టులు నిర్వహించాకే ఎగ్జామ్స్‌ పెట్టాలని డిమాండ్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట ధర్నాకు దిగారు విద్యార్థినులు.

మరోపక్క పరీక్షలు యథాతథంగా జరుగుతాయని కాలేజీ రిజిస్ట్రార్‌ ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా ఎగ్జామ్స్‌ రాయని పరిస్థితి ఉంటే వారికి మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని ఓయూ అధికారులు తెలిపారు. దీంతో ఓయూలో నేటి నుంచి జరగాల్సిన మూడో సెమిస్టర్‌ పరీక్షలపై గందరగోళం నెలకొంది. ఓ వైపు కరోనా మహమ్మారి విస్తరణ మరోవైపు పరీక్షల నిర్వహణతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు స్టూడెంట్స్.

Tags:    

Similar News